women’s reservation bill: మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై హర్షాతిరేకాలు

women’s reservation bill: మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై హర్షాతిరేకాలు
స్వాగతించిన తెలంగాణ మంత్రులు, మహిళా నేతలు... సంబరాలు చేసుకున్న కల్వకుంట్లు కవిత

మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలపడాన్ని తెలంగాణ మంత్రులు, మహిళా నేతలు స్వాగతించారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా పార్లమెంటులో మహిళా బిల్లును ఆమోదింపజేయాలని బీఆర్‌ఎస్‌ MLC కల్వకుంట్ల కవిత కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్‌లో బిల్లు ఆమోదానికి పూర్తిగా సహకరిస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి ఫలితంగా బీజేపీ, కాంగ్రెస్‌లో చలనం వచ్చిందని కవిత పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై కేంద్రప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదన్న కవిత కనీసం ఇప్పుడైనా బిల్లు పెడుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. కేంద్రం పారదర్శకంగా ఉండాలని బిల్లు విధివిధానాలను దాయాల్సిన అవసరం లేదన్నారు.


మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదంతో భారతదేశంలో మహిళలు విశ్వంముందు తలెత్తుకొని నిలబడేలా ఉంటుందని ఆకాశంలో సగం, భూమిలో సగం అధికారంలో సగమని మహిళాలోకం నినదించినట్లు అవుతుందని కవిత చెప్పారు. అనంతరం మహిళా కార్యకర్తలతో కలిసి కవిత సంబురాలు జరుపుకున్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుపై భారాస పోరాటం ఫలించిందని తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. లోక్ సభ, అసెంబ్లీలో మహిళలకు 33శాతం రిజర్వేషన్ల మహిళ బిల్లుపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్నిస్వాగతిస్తున్నట్లు చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని కేంద్రానికి లేఖ రాసి సీఎం కేసీఆర్ పెద్ద పాత్ర పోషించారని కొనియాడారు.

మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రమంత్రి వర్గం ఆమోదించడం చారిత్రాత్మక నిర్ణయమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమ అన్నారు. మహిళల తరుపున ప్రధాని మోదీ, కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆ బిల్లు ఆమోదం పొందుతుందని విశ్వాసంవ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును గతంలో మొదట పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టింది NDA ప్రభుత్వమేనని రాణిరుద్రమ గుర్తుచేశారు. సొంత పార్టీలో, ఏ ఒక్క కమిటీలో మహిళలకు స్థానం ఇవ్వని బీఆర్‌ఎస్‌ అసలు రంగు, ఉభయ సభల్లో బిల్లుకు మద్దతిచ్చేటప్పుడు బయటపడుతుందని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story