TELANGANA: హోరెత్తుతున్న ఎన్నికల ప్రచారం

TELANGANA: హోరెత్తుతున్న ఎన్నికల ప్రచారం
గ్రామగ్రామాన పతకాస్థాయికి చేరిన ప్రచారం.... ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అధికార, విపక్షాల యత్నం...

తెలంగాణలో ఎన్నికల ప్రచారం పతాకస్థాయికి చేరింది. అధికార, ప్రతిపక్షాలు ఓటర్లను ఆకట్టుకునేందుకు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. వాడవాడలా తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో అధికార బీఆర్‌ఎస్‌ దూసుకేళ్తోంది. ఓవైపు పార్టీ అధ్యక్షుడు KCR ప్రజా ఆశీర్వాదసభలతో ప్రజల్లోకి వెళ్తుంటే.. నియోజకవర్గ నేతలు పార్టీ ఎన్నికల ప్రణాళికను క్షేత్రస్థాయిలో వివరిస్తూ.. ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. అధికార పార్టీ 24 గంటల కరెంటే ప్రధాన ఎజెండాగా ప్రచారం చేస్తోంది. అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ బీఅర్‌ఎస్‌ను మూడోసారి అధికారంలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి దానం నాగేందర్ హిమాయత్ నగర్‌లో పూజలు చేసిన అనంతరం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. సనత్‌నగర్‌ నియోజకవర్గం పరిథిలోని ముస్లిం మత పెద్దలు, ముఖ్య నేతలతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశమయ్యారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లో భారాస ఎమ్మెల్యే అభ్యర్థి నోముల భగత్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.


భద్రాచలంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్ధి తెల్లం వెంకట్రావు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రజలలో కారు పార్టీకి ఉన్న ఆదరణ చూసి కొందరు ఓర్వలేక బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. పెద్దపల్లిజిల్లా కోరుట్లలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కుమారుడు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సంజయ్‌తో కలిసి పలుగ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. సింగరేణిలో సంక్షేమం కొనసాగాలంటే KCR ప్రభుత్వమే అధికారంలో ఉండాలని చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. విపక్ష పార్టీలు సైతం ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. టికెట్‌ ఖరారైన కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ఊరూరా విస్తృతంగా పర్యటిస్తున్నారు.


బీఆర్‌ఎస్‌ సర్కార్‌ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ తాము అధికారంలోకి వస్తే చేపట్టబోయే కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు. నాయకుల పర్యటనలు, సమావేశాలు, సభలతో ఊరూవాడా ఎన్నికల సందడి నెలకొంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు మరో నెలరోజులే గడువుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. అధికార బీఆర్‌ఎస్‌ను గద్దె దించటమే లక్ష్యంగా కాంగ్రెస్‌, బీజేపీలు పోటీపోటీగా ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఖమ్మం సారథీనగర్‌లో అధికార పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు తుమ్మల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన తుమ్మల మంత్రి పువ్వాడ అజయ్‌పై విమర్శలు గుప్పించారు. బీజేపీ సైతం అభ్యర్థులు ఖరారైన చోట విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. నిర్మల్‌లో పార్టీ అభ్యర్థి మహేశ్వర్‌రెడ్డి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. లక్ష్మణచాంద మండలం చామన్‌పల్లి గ్రామానికి చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు భాజపాలో చేరారు. వారికి మహేశ్వర్‌రెడ్డి పార్టీ కండువా కప్పి, ఆహ్వానించారు.

Tags

Read MoreRead Less
Next Story