Telangana : లాభాల కోసం సాగు చేస్తే గిట్టుబాటు ధర లేక నష్టాలు

Telangana : లాభాల కోసం  సాగు చేస్తే గిట్టుబాటు ధర లేక నష్టాలు
రైతుల కంట కన్నీరు పెట్టిస్తోన్న మిర్చి

మిర్చి పంట రైతులను నష్టాలపాలుచేస్తోంది. లాభాల పంట పండుతుందని సాగుచేస్తే... చివరకు గిట్టుబాటు ధర లేక నష్టాలు చవిచూస్తున్నారు. వర్షాభావం, చీడపీడలుతో పాటు పెరిగిన పెట్టుబడి వ్యయాన్నిభరించి పండించిన పంటను మార్కెట్‌కు తెస్తే నిరాశే ఎదురైంది. క్వింటాల్ ఎండుమిర్చి ధర 8 నుంచి 15 వేలకు మించడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

గత ఏడాది సీజన్‌లో వరంగల్, ఖమ్మం మార్కెట్లలో క్వింటాల్ మిరప 25 వేల రూపాయల వరకు పలికింది. ఈ ఏడాది సీజన్‌ ఆరంభంలోనూ కనిష్టంగా 14వేలు, గరిష్ఠంగా 20వేల వరకు పలికింది. దీంతో సీజన్‌ చివరి వరకు ఇవే ధరలు కొనసాగుతాయాని రైతులు ఆశించారు. కానీ వారి ఆశలు అంతలోనే ఆవిరయ్యాయి. మిరప కోతలు ముగింపు దశకు వస్తున్న వేళ... పతనమవుతున్న ధరలు కర్షకుల్ని కోలుకోనివ్వడంలేదు. ప్రస్తుతం క్వింటాల్ ధర 8 నుంచి 15 వేల రూపాయలకు మించకపోవడంతో... రాకపోవడంతో పెట్టిన పెట్టుబడులైనా చేతికి రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఏడాది ఖమ్మం, మహబూబాబాద్, గద్వాల్, సూర్యాపేట, వరంగల్ గ్రామీణం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూలు తదితర జిల్లాల్లో 3.25 లక్షల ఎకరాల్లో మిరప సాగైంది. ఈ క్రమంలో ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద వరంగల్‌లోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు ఎర్ర బంగారం పోటెత్తుతోంది. సీజన్ ప్రారంభంలో 2 వేల నుంచి 10 వేల వరకు బస్తాలు రాగా ఆ తర్వాత నుంచి పెద్దఎత్తున రైతులు తీసుకువస్తున్నారు. హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు కూడా పెద్ద ఎత్తున పంట అమ్మకానికి వస్తోంది. కానీ పడిపోయిన ధరలతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ పరిస్థితులు, చీడపీడల బెడద తట్టుకుని పంట పండించి తీసుకువస్తే.. గిట్టుబాట ధర లేదని రైతులు చెబుతున్నారు.

పచ్చళ్ల సీజన్ కావడంతో చిల్లర మార్కెట్లు, సూపర్ మార్కెట్లలోనూ ధరలు ఉంటాయని వ్యవసాయ అధికారులు అంటున్నారు. శీతల గిడ్డంగులు సైతం మిరప పంట నిల్వలతో నిండిపోవడంతో రైతులు మార్కెట్‌యార్డులకు పంటను తీసుకొస్తున్నారు. దీని వలన రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదని చెబుతున్నారు. పెరిగిపోతున్న పెట్టుబడుల వ్యయం నేపథ్యంలో క్వింటాల్ ధర 25 వేల రూపాయలు పలికితే తప్ప అప్పులబారిన పడకుండా ఉండవచ్చని రైతులు అంటున్నారు

Tags

Read MoreRead Less
Next Story