Chilukuru Temple: గరుడ ప్రసాదం కోసం చిలుకూరుకు పోటెత్తిన జనం

తొక్కిసలాటతో పంపిణీ నిలిపివేసిన అర్చకులు

భగవంతుడిపై భక్తుల నమ్మకం ఆ బంధానికుండే భావోద్వేగం మాటల్లో చెప్పలేం. తాను ఆరాధించే రూపంలోనే దేవుడున్నాడని భావిస్తూ ఆ నమ్మకంతోనే ఎంతదూరమైనా వెళ్తారు. ఉద్వేగపూరితమైన అంతటి విశ్వాసం సోషల్‌ మీడియా ప్రచార చేష్టలకు చిన్నబోయింది. అంచనాలకు మించి తరలొచ్చిన జనం కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలతో.... ఆలయం వద్ద గంటల పాటు జనం చుక్కలు చూశారు. చిలుకూరి బాలాజీ బ్రహ్మోత్సవాల వేళ గరుడ ప్రసాద వితరణ ప్రచారంతో నెలకొన్న పరిణామాలు లక్షలాదిగా వచ్చిన భక్తులకు నరకం చూపించాయి.

రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాద వితరణ భక్తులు, సామాన్యులను తీవ్ర ఇబ్బందులను గురిచేసింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణ అనంతరం సంతాన లేమితో బాధపడే మహిళలకు గరుడ ప్రసాదం పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా ఉత్సవాల్లో గరుడ ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ ప్రకటించడంతో ఆ విషయం సామాజిక మాద్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం జరిగింది. నగర నలుమూలల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు తెల్లవారుజామున 4 గంటల నుంచే చిలుకూరు బాలాజీ ఆలయానికి పోటెత్తారు. దీంతో ఆలయానికి వెళ్లే రహదారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి.

ఆలయ కమిటీ అంచనాలకు మించి జనం పోటెత్తడంతో నగరంలోని లంగర్ హౌజ్ నుంచి మొదలుORR, పోలీస్‌అకాడమీ జంక్షన్, అజీజ్ నగర్, చిలుకూరు చౌరస్తా మీదుగా ఆలయం వరకు సుమారు 30 కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఆ మార్గంలో చేవెళ్ల, వికారాబాద్ వెళ్లే సాధారణ వాహనదారులూ ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న మొయినాబాద్ పోలీసులు... ట్రాఫిక్‌ను నియంత్రించే ప్రయత్నం చేశారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో ఓ దశలో ట్రాఫిక్ పోలీసులూ చేతులెత్తేశారు. వెంటనే పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని అదనపు సిబ్బందితో... ఆలయానికి వచ్చే వాహనాలను దారి మళ్లించారు. భక్తులను నడిచి వెళ్లాల్సిందిగా సూచించడంతో సుమారు ఐదారు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి ప్రసాదం కోసం పోటీపడ్డారు.

సుమారు ఐదు వేల మంది రావొచ్చని ఆలయ నిర్వాహకులు అంచనా వేశారని, అంతకు మించి ఉదయం పదిన్నర వరకే 60 వేల మందికిపైగా భక్తులు రావడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తిందని మొయినాబాద్ పోలీసులు తెలిపారు. మరోవైపు భక్తుల కోసం సరైన సౌకర్యాలు లేవని, తాగునీటి సౌకర్యమూ లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం వచ్చిన 30 వేల మందికి గరుడ ప్రసాదం పంపిణీ చేసి, ఆ తర్వాత ప్రసాదం పంపిణీ నిలిపివేశామని ఆలయ సిబ్బంది వెల్లడించారు. అయినప్పటికీ ఆలయానికి భక్తుల తాకిడి తగ్గకపోవటంతో... ప్రసాద వితరణ నిలిపివేశారు. దీంతో భక్తజనం నిరాశతో వెనక్కివెళ్లిపోయారు

Tags

Read MoreRead Less
Next Story