AMIT SHAH: బీసీని ముఖ్యమంత్రిని చేస్తాం

AMIT SHAH: బీసీని ముఖ్యమంత్రిని చేస్తాం
సూర్యపేట జనగర్జన సభలో అమిత్‌ షా హామీ... కేసీఆర్‌ సాధించేదేమీ లేదని విమర్శ

తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం కేంద్రంలోని బీజేపీ పనిచేస్తోందని.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. కేటీఆర్‌ను సీఎం చేయాలని కేసీఆర్‌ అనుకుంటున్నారని... సోనియా గాంధీ రాహుల్‌ను ప్రధాని చేయాలని చూస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో నవంబర్‌ 30న జరగనున్న ఎన్నికలకు బీజేపీ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసింది. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ, అమిత్‌ షా, జేపీ నడ్డాలతో ప్రచారం చేయించిన కమలదళం సూర్యాపేటలో జనగర్జన సభ నిర్వహించింది. ఈ సభకు హాజరైన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ఆ రెండు పార్టీలు తమ కుటుంబాల కోసమే పనిచేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఆ రెండు పార్టీలు తెలంగాణకు చేసిందేమీ లేదన్న అమిత్ షా ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు.అధికారంలోకి వచ్చేముందు కేసీఆర్‌ ఎన్నో హామీలు ఇచ్చారని గుర్తుచేసిన షా వాటి అమలు ఏమైందని ప్రశ్నించారు. తెలంగాణలోని అన్ని వర్గాల సంక్షేమానికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు.


దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామన్న హామీ ఏమైందని కేసీఆర్‌ను అమిత్‌ షా ప్రశ్నించారు. ఇప్పుడైనా దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తారా లేదా నిలదీశారు. బీసీ సంక్షేమం కోసం‌ ఏటా పది వేల‌కోట్లు కేటాయిస్తామని అన్నారని... ఆ నిధులు ఏమయ్యాయని షా ప్రశ్నింంచారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కుటుంబ సభ్యుల కోసమే పనిచేసే పార్టీలని మండిపడ్డారు. తెలంగాణలో పసుపు రైతుల కోసం జాతీయ పసుపు బోర్డును కూడా ఏర్పాటు చేశామని, సమ్మక్క-సారక్క ట్రైబల్‌ యూనివర్సిటీని మంజూరు చేశామని.. తెలంగాణ అభివృద్ధి అన్ని విధాల కట్టుబడి ఉన్నామన్నారు. ఐదు వందల యాభై ఏళ్ల పోరాటం అయోధ్య రామాలయ నిర్మాణమన్న అమిత్ షా... అయోధ్యలో రామమందిర నిర్మాణం జరగాలా? వద్దా? అని ప్రజలను ప్రశ్నించారు. జనవరి 22న ప్రధాని మోదీ రామమందిరంలో పూజ చేయబోతున్నారని. జనవరి చివరి వారంలో మీరందరూ అయోధ్యకు రావాలని పిలుపునిచ్చారు.


అంతకుముందు మాట్లాడిన భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి..తెలంగాణకు కేంద్రం సహకరించడం లేదంటూ భారాస నేతలు తప్పుడు విమర్శలు చేస్తున్నారని ఆక్షేపించారు. తెలంగాణలో భాజపా సర్కారు అధికారానికి రాగానే హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు పారిశ్రామిక వాడను ఏర్పాటు చేస్తామన్నారు. ఉచిత విద్య, వైద్యం అందిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పంట బీమా అమలు చేసి రైతులను ఆదుకుంటామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story