ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ తీపికబురు.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ తీపికబురు.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
వేతన సవరణ ఆరేళ్లుగా ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తూ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్.. తెలంగాణ ఉద్యోగులపై అసెంబ్లీ వేదికగా వరాలు కురిపించారు. రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ 30శాతం పీఆర్సీ ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. 30శాతం ఫిట్‌మెంట్ ఉత్తర్వులు ఏప్రిల్ 1, 2021 నుంచి అమల్లోకి వస్తాయన్నారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, హోంగార్డులకు, వీఆర్ఏ, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీలకు కూడా పీఆర్సీ వర్తిస్తుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. 12 నెలల బకాయిలు చెల్లించడంతో పాటు గ్రాట్యుటీ 16 లక్షల రూపాయలకు పెంచుతున్నట్లు స్పష్టంచేశారు.

ఉద్యోగులు కోరినట్లుగానే మెరుగైన రీతిలో 11వ వేతన సవరణ చేపట్టామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంచేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఈ పీఆర్సీ వర్తిస్తుందని చెప్పారు. తాజా పీఆర్సీ ప్రకటనతో దాదాపు 10 లక్షల మంది ఉద్యోగులకు వేతనాల పెంపు వర్తిస్తుందన్నారు. ప్రమోషన్ల తర్వాత వెంటనే ఖాళీలుగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని కేసీఆర్ తెలిపారు. అలాగే రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ వయసును 61 సంవత్సరాలకు పెంచుతున్నామని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. అలాగే టీచర్ల అంతరాష్ట్ర బదిలీలకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఆర్థికమాంద్యం కారణంగా పీఆర్సీ ఆలస్యమైందని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. అనేక దఫాలుగా సీఎస్ నేతృత్వంలోని కమిటీ పీఆర్సీ విధానాలపై అధ్యయనం చేసిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషించారన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. సభలో ఉద్యోగ సంఘాల పేర్లను ప్రస్తావించారు. ఉమ్మడి ఏపీలో టీఎన్జీవో ఉద్యోగుల పోరాటం అనిర్వచనీయమని కొనియాడారు. తెలంగాణ సోయిని నిలిపి ఉంచడంలో టీఎన్జీవో స్ఫూర్తి మరవలేనిదన్నారు. ఉద్యోగుల పట్ల తనకున్న అభిమానాన్ని ప్రభుత్వం చాటుకుందన్న సీఎం కేసీఆర్.. ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా వ్యవహరిస్తోందని చెప్పారు.

తెలంగాణ ఉద్యోగులపై ముఖ్యమంత్రి కేసీఆర్ పీఆర్సీ 30శాతం ప్రకటించడాన్ని ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేసాయి. అసెంబ్లీలోని ముఖ్యమంత్రి చాంబర్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపాయి. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోను లేనివిధంగా అన్ని రకాల ఉద్యోగులకు ఫిట్‌మెంట్ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని టీజీవో రాష్ట్ర అధ్యక్షురాలు మమత అన్నారు. ఉద్యోగులు గౌరవంగా పనిచేసేలా సీఎం కేసీఆర్ చేశారని టీఎన్జీవో నేత మామిళ్ల రాజేందర్‌ కొనియాడారు.

మొత్తానికి ప్రభుత్వ ఉద్యోగులకు 30శాతం ఫిట్‌మెంట్ సహా ఇతర సమస్యలను పరిష్కరిస్తూ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన పట్ల ఉద్యోగ కుటుంబాలు సంబురాలు చేసుకుంటున్నారు.

నిజామాబాద్ జిల్లాలో టీఎన్జీవో సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. స్వీట్లు పంచుతూ.. నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. అన్ని రకాల, అన్ని స్థాయిలోని ఉద్యోగులకి వేతనాలు పెంచడం పట్ల సీఎం కేసీఆర్‌కు టీఎన్జీవో నేతలు, ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు.

అటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగుల సంబురాలు చేసుకున్నారు. టీఎన్జీవో ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు ఉద్యోగులు పాలాభిషేకం చేశారు. స్వీట్లు పంచుతూ బాణసంచా పేల్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వెన్నంటే నడిచిన ఉద్యోగులకు సీఎం కేసీఆర్ ఫిట్‌మెంట్ సహా, ఇతర సమస్యలను పరిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందని ఉద్యోగ సంఘాల నేతలు అన్నారు.


Tags

Read MoreRead Less
Next Story