పెండింగ్ మ్యుటేషన్ల కోసం తాజాగా దరఖాస్తులు తీసుకోవాలి: కేసీఆర్

పెండింగ్ మ్యుటేషన్ల కోసం తాజాగా దరఖాస్తులు తీసుకోవాలి: కేసీఆర్
ధరణి పోర్టల్ ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా మార్చాలన్నారు సీఎం కేసీఆర్. ఇందుకోసం తక్షణం కొన్ని మార్పులు చేయాలని సూచించారు.

ధరణి పోర్టల్ వందకు వంద శాతం విజయవంతమైందని ముఖ్యమంత్రి కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. పలు కీలక అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో మంత్రులు, కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పెండింగ్ మ్యుటేషన్ల కోసం తాజాగా దరఖాస్తులు తీసుకోవాలని, వారం రోజుల్లోగా మ్యుటేషన్లు చేయాలని కోరారు.

భూ రికార్డుల సమగ్ర ప్రక్షాళన, కొత్త పాస్ పుస్తకాల పంపిణీ, కొత్త రెవెన్యూ చట్టం తదితర సంస్కరణల ఫలితంగా భూ యాజమాన్య విషయంలో స్పష్టత వస్తుందని కేసీఆర్ చెప్పారు. వ్యవసాయ భూముల అమ్మకాలు, కొనుగోళ్ల విషయంలో మరింత వెసులుబాటు కలిగించేందుకు అవసరమైన మార్పులను వారం రోజుల్లోగా ధరణి పోర్టల్ లో చేయాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ పరమైన అంశాలన్నింటినీ జిల్లా కలెక్టర్లే పరిష్కరించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రెవెన్యూ రికార్డుల నిర్వహణ ఎంతో అస్తవ్యస్తంగా ఉండేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దీంతో ఘర్షణలు, వివాదాలు తలెత్తేవని.. వాటిని రూపుమాపేందుకు, ప్రతి గుంటకూ యజమాని ఎవరో స్పష్టంగా తెలిసేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని వెల్లడించారు.

ధరణి పోర్టల్ ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా మార్చాలన్నారు సీఎం కేసీఆర్. ఇందుకోసం తక్షణం కొన్ని మార్పులు, చేర్పులు చేయాలని సూచించారు. ఎన్నారైలకు తమ పాస్ పోర్ట్ నంబరు ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేయడానికి ధరణి పోర్టల్ లో అవకాశం కల్పించాలన్నారు. కంపెనీలు, సొసైటీలు కొనుగోలు చేసిన భూములకు కూడా పాస్ బుక్ పొందే విధంగా ధరణిలో వెసులుబాటు కల్పించాలన్నారు.

గతంలో ఆధార్ కార్డు నంబరు ఇవ్వనివారి వివరాలను ధరణిలో నమోదు చేయలేదని.. అలాంటివారికి మరోసారి అవకాశం ఇచ్చి, ఆధార్ నంబరు నమోదు చేసుకొని పాస్ పుస్తకాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. రెవెన్యూ పరమైన అంశాలన్నింటినీ కిందిస్థాయి అధికారులకు అప్పగించి, కలెక్టర్లు చేతులు దులుపుకుంటే ఆశించిన ఫలితం రాదని.. కలెక్టర్లే అన్ని విషయాల్లో స్వయంగా పరిశీలన జరిపి, నిర్ణయాలు తీసుకోవాలన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.


Tags

Read MoreRead Less
Next Story