KCR: నేడు కేసీఆర్‌ క్షేత్రస్థాయి పర్యటన

KCR: నేడు కేసీఆర్‌ క్షేత్రస్థాయి పర్యటన
జనగాం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో ఎండిపోయిన పంటల పరిశీలన

సాగునీరు అందక ఎండుతున్న పంటలను పరిశీలించేందుకు భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ నేడు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఎండిపోయిన పంటల పరిశీలన నిమిత్తం జనగాం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు. ఉదయం ఎర్రవెల్లి నుంచి బయల్దేరి జనగాం జిల్లా దేవరుప్పల మండలం ధారావత్ తాండాకు చేరుకుంటారు. అక్కడ ఎండిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడతారు. అనంతరం సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, అర్వపల్లి, సూర్యాపేట గ్రామీణ మండలాల్లో పర్యటించి పంటలను పరిశీలిస్తారు. ఆ తర్వాత సూర్యాపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహిస్తారు. అక్కణ్నుంచి బయల్దేరి నల్గొండ జిల్లాలోని నిడమనూరు మండలంలో ఎండిన పంటలను పరిశీలిస్తారు. రైతులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుంటారు. మూడు జిల్లాల పర్యటన అనంతరం కేసీఆర్ రాత్రికి తిరిగి ఎర్రవెల్లి చేరుకుంటారు.


కేసీఆర్‌ పర్యటనపై అధికార కాంగ్రెస్‌ విమర్శలు కురిపించింది. కేసీఆర్ నిర్లక్ష్యం వల్లనే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరవు వచ్చిందని... ఏ ముఖం పెట్టుకుని కేసీఆర్ జిల్లాకు వస్తారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లిలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. కేసీఆర్ చేసిన మోసాలకు దేవుడు తగిన బుద్ధి చెప్పారని విమర్శించారు. తమకు ఇతర పార్టీలతో పోటీ లేదని... తమ మధ్య తమకే పోటీ అని అన్నారు. వేసవి ప్రారంభమై నెల రోజులు గడవక ముందే పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 14 మండలాల్లో వేలాది ఎకరాల వరి, మొక్కజొన్న పంటలు ఎండిపోయాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ వాపోయారు. సాగునీరందక జిల్లాలో ఎండిపోతున్న పంటలను రక్షించాలంటూ 36 గంటల నిరసన దీక్ష చేపట్టిన కొప్పుల....సీఎం రేవంత్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులకు వ్యవసాయంపై అవగాహన లేకపోవడంతోనే పంటలు ఎండిపోతున్నాయని ఆరోపించారు. జిల్లావ్యాప్తంగా ఎండిపోయిన పంటలపై సమీక్ష నిర్వహించి... పంట కోల్పోయిన ప్రతి రైతుకు ఎకరాకు 25 వేలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. దీక్షలో ఎండిపోయిన మొక్కజొన్న, వరి పంటలను ప్రదర్శించిన కొప్పుల... సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ...నిరసన వ్యక్తం చేశారు.

కడియం పార్టీ మార్పు ఎప్పుడో..?

బీఆర్‌ఎస్‌ నేతలు అయోమయంలో ఉన్నారని..స్టేషన్ ఘన్ పూర్ MLA కడియం శ్రీహరి అన్నారు. భారాసను వీడేందుకు సిద్ధమైన కడియం శ్రీహరి.. తదుపరి కార్యాచరణపై దృష్టి సారించారు. కాంగ్రెస్ లో చేరేందుకు..... సన్నాహాలు చేసుకుంటున్నారు. కుమార్తె కావ్యతో కలిసిహైదరాబాద్ లోని తన నివాసంలో.. అనుచరులతో కడియం సమావేశమయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారాస బలహీన పడిందన్న కడియం...... భారాస నేతల నుంచి సహకారం లభించలేదన్నారు. ఓడిపోయే పార్టీ నుంచి కావ్య పోటీ వద్దని అనుకున్నట్లు శ్రీహరి చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story