డిసెంబర్‌ 7 నుంచి అర్హులైన అందరికీ వరద సాయం : సీఎం కేసీఆర్

డిసెంబర్‌ 7 నుంచి అర్హులైన అందరికీ వరద సాయం : సీఎం కేసీఆర్

విభజన శక్తులు హైదరాబాద్‌ నగరాన్ని దెబ్బ తీయాలని చూస్తున్నాయని టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శాంతిని కోల్పోయి..... భావితరాల్ని ఇబ్బంది పెట్టొద్దని అన్నారు. ఎల్బీ స్టేడియంలో టీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభలో ప్రసంగించిన కేసీఆర్‌... హైదరాబాద్‌ శాంతిని కాపాడేందుకు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇద్దరు ముగ్గురి మాటలతో ఆవేశానికి గురికాబోమని స్పష్టంచేశారు. కేసీఆర్‌ తల్చుకుంటే దుమ్ముదులిపేలా తిట్టగలడని వ్యాఖ్యానించారు. బాకాలు చెబితే సమస్యలు పోవని అన్నారు.

పిచ్చి ఆవేశానికి పోయి ఓటు వేస్తే... నగరంలో అశాంతి నెలకొంటుందని కేసీఆర్ అన్నారు. తెలంగాణ సాధించిన వ్యక్తిగా.. తెలంగాణ కుటుంబ పెద్దగా కోరుతున్నానని విజ్ఞప్తి చేశారు. అందరూ చిరునవ్వుతో... సంతోషంతో ముందుకు వెళ్లే నగరంగా తీర్చిదిద్దుదామని చెప్పారు. నగరాన్ని బాగు చేసే బాధ్యతను తీసుకుంటానని తెలిపారు. హైదరాబాద్‌ భవిష్యత్‌ను ప్రజలే నిర్ణయించాలని కోరారు. గ్రేటర్‌ ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తంచేశారు. నూతన అభివృద్ధి ప్రణాళికతో ప్రజల ముందుకు వస్తామని తెలిపారు.

ఆరేళ్ల క్రితం టీఆర్‌ఎస్‌ను ప్రజలు దీవించి అధికారం ఇచ్చారని కేసీఆర్‌ అన్నారు. అందరి అంచనాలు తలక్రిందులు చేసి సుపాలన అందిస్తున్నామని అన్నారు. కులమతాలకు అతీతమైన పాలన అందిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో నివసించే అందరూ మా బిడ్డలే అనే స్ఫూర్తితో పాలన సాగిస్తున్నట్టు తెలిపారు. ఎవరూ ఊహించని విజయాలు సాధించామని కేసీఆర్‌ వివరించారు. కృషి, పట్టుదలతో రాష్ట్రంలో కరెంటు బాధలు తీర్చామని తెలిపారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెల్చిన తర్వాత 20వేల లీటర్ల వరకు ఉచితంగా తాగునీరు అందిస్తామని కేసీఆర్‌ తెలిపారు. పరిశ్రమల్ని సిటీ వెలుపలికి పంపించి... కాలుష్యం తగ్గించాల్సి ఉందని చెప్పారు. మెట్రో రైల్‌ విస్తరిస్తామని, కాలుష్యం తగ్గించేందుకు ఎలక్ట్రిక్‌ వాహనాల్ని ప్రోత్సహిస్తామని వివరించారు. పిల్లాపాపలతో సుభిక్షంగా బ్రతికే చల్లటి... చక్కటి హైదరాబాద్‌గా తీర్చిదిద్దుతామని అన్నారు. వరద సాయం అందించడంలో వివక్ష చూపించిందని ఈ సందర్భంగా విమర్శించారు. డిసెంబర్‌ 7 నుంచి అర్హులైన అందరికీ వరద సాయం పంపిణీ చేస్తామని చెప్పారు.


Tags

Read MoreRead Less
Next Story