Top

మహిళా సంరక్షణ కోసం మరింతగా శ్రమించాలి : సీఎం కేసీఆర్

రైతులు పండించిన వరి ధాన్యాన్ని గ్రామాల్లోనే పూర్థి స్థాయిలో కొనుగోలు చేయనున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. కరోనా ప్రమాదం ఇంకా పూర్తిగా తొలగిపోనందున..

మహిళా సంరక్షణ కోసం మరింతగా శ్రమించాలి : సీఎం కేసీఆర్
X

రైతులు పండించిన వరి ధాన్యాన్ని గ్రామాల్లోనే పూర్థి స్థాయిలో కొనుగోలు చేయనున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. కరోనా ప్రమాదం ఇంకా పూర్తిగా తొలగిపోనందున.. రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని వివిధ ప్రభుత్వ ఏజెన్సీలను గ్రామాలకు పంపి మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయిస్తామని తెలిపారు. వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు, అధికారులతో మరోసారి సమీక్ష నిర్వహించారు. కరోనా సమయంలో పూర్తిస్థాయిలో కొనుగోళ్లు చేసిన విధంగానే.. ఇప్పుడు కూడా ఏజెన్సీలు రైతుల వద్దకే వచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తాయని చెప్పారు. మార్కెట్లకు ధాన్యాన్ని తీసుకొచ్చి రైతులు ఇబ్బంది పడొద్దని కేసీఆర్‌ సూచించారు.

17శాతానికి లోబడి తేమ ఉన్న ధాన్యాన్ని ఎండబెట్టి పొల్లు, తాలు లేకుండా తీసుకొస్తే ఏ- గ్రేడ్ రకానికి క్వింటాల్‌కు 1888 రూపాయలు, బీ-గ్రేడ్ రకానికి క్వింటాల్‌కు 1868 రూపాయలు కనీస మద్దతు ధరను ప్రభుత్వమే చెల్లిస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు. గ్రామాల్లో వరికోతల కార్యక్రమం నెలా పదిహేను రోజుల పాటు సాగుతుందని, కొనుగోళ్ల విషయంలో రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాలశాఖల అధికారులు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మొత్తం ఎంత ధాన్యం వచ్చే అవకాశం ఉంటుందనే అంశంపై పక్కాగా అంచనా వేయాలని చెప్పారు. కొనుగోళ్ల కోసం తగిన ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సూచించారు.

సాగునీటి సౌకర్యం క్రమంగా పెరుగుతుండటంతో పడావు పడ్డ భూములు కూడా బాగవుతూ, సాగులోకి వస్తున్నాయని కేసీఆర్‌ అన్నారు. రైతుబంధు పథకం కింద ప్రభుత్వమే పంట పెట్టుబడి సాయం అందిస్తుండటంతో పట్టణాలకు వలస వెళ్లిన రైతులు కూడా గ్రామాలకు తిరిగివచ్చి భూములు సాగు చేసుకోవడం సంతోషకరమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. బ్యాంకు గ్యారెంటీలు సహా రైతుల ధాన్యం అమ్మకం డబ్బు వెంటనే చెల్లించేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో పౌరసరఫరాలశాఖ ఇంకా విస్తృతంగా బలోపేతం కావాల్సిన అవసరం ఉందని, అందుకు అనుగుణంగా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. నిర్దేశిత పంటలు వేయాలని ప్రభుత్వం సూచించిన విధంగా రైతులు 10 లక్షల 78 వేల ఎకరాల్లో కంది పంట సాగు చేయడం అభినందనీయమని అన్నారు. ఆ పంటను కూడా కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు.

అంతకు ముందు రాష్ట్ర పోలీసు, అటవీశాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్‌.. వారికి పలు సూచనలు చేశారు. హైదరాబాద్‌లో పది లక్షల సీసీ కెమెరాల ఏర్పాటు లక్ష్యంగా కార్యాచరణ వేగవంతం చేయాలని డిజిపికి సూచించారు. పోలీసు వ్యవస్థలో ఐటీ పాత్రను పెంచి నేరాలను అరికట్టడంలొ సాంకేతిక వ్యవస్థలను ఉపయోగించుకోవాలన్నారు. దేశానికే తలమానికంగా హైదరాబాద్ లో నిర్మితమౌతున్న పోలీసు కమాండ్ కంట్రోల్ వ్యవస్థ నిర్మాణాన్ని అతి త్వరలో పూర్తిచేసి వినియోగంలోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం మహిళల భధ్రతను ప్రాధాన్యతాంశంగా తీసుకుని పనిచేస్తోందని.. మహిళా సంరక్షణ కోసం మరింతగా శ్రమించాల్సిన అవసరముందని అన్నారు. సమాజాన్ని పీడించే గంజాయి వంటి వాటి ఉత్పత్తి, అమ్మకం, రవాణా వ్యవస్థలను పూర్తిగా అరికట్టాలన్నారు. అటవీ సంపదను కొల్లగొట్టే వారిపట్ల మరింత కఠినంగా వ్యవహరించాలని సీఎం ఆదేశించారు. తెలంగాణను గుడుంబా రహిత రాష్ట్రంగా మార్చిన ఎక్సైజు, సివిల్ పోలీసులు తిరిగి అదే స్ఫూర్తితో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశవ్యాప్తంగా దళితుల మీద దాడులు జరుగుతున్న వార్తలు వినడం శోచనీయమని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుస్థితి నుంచి సమాజం దూరం కావాలని ఈ సందర్భంగా సీఎం ఆకాంక్షించారు.

నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారాల మీద పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించి అరికట్టాలని సిఎం చెప్పారు. కష్టపడి సాధించాల్సిన పట్టాలను తప్పుడుదారుల్లో పొందే సంస్కృతి సమాజానికి తప్పుడు సంకేతాలిస్తుందని తెలిపారు. ఫేక్ సర్టిఫికెట్లను సృష్టించే ముఠాలు, వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు సిఎం కెసిఆర్ సూచించారు. పోలీసు శాఖలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు పెన్షన్ సెటిల్ చేసి, సర్వీసు ఆఖరి రోజున గౌరవప్రదంగా ఇంటిదాకా సాగనంపాల్సిన అవసరాన్ని ముఖ్యమంత్రి మరోమారు పోలీసు ఉన్నతాధికారులకు గుర్తుచేశారు. డ్యూటీలో వుంటూ చనిపోయిన ఉద్యోగి వారసులకు, నిబంధనల ప్రకారం కారుణ్య నియామకానికి అర్హత కలిగిన వారసులకు, తక్షణమే ఉద్యోగం ఇవ్వాలని, దీనిపై తక్షణ కార్యాచరణ చేపట్టాలని సీఎం కేసీఆర్‌ అధికారులకు సూచించారు.

Next Story

RELATED STORIES