KCR : పరిస్థితి మెరుగుపడేవరకు ఎమ్మెల్యేలు నియోజకవర్గాలు దాటొద్దు : కేసీఆర్

KCR : పరిస్థితి మెరుగుపడేవరకు ఎమ్మెల్యేలు నియోజకవర్గాలు దాటొద్దు : కేసీఆర్
KCR : తెలంగాణలో ఎడతెరిపిలేని వర్షాలు, వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో వున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

KCR : తెలంగాణలో ఎడతెరిపిలేని వర్షాలు, వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో వున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.. తక్షణ చర్యలు కొనసాగిస్తూ ఆస్తి, ప్రాణ నష్టాలను వీలైంతమేర తగ్గించాలని అధికార యంత్రాంగానికి, ప్రజాప్రతినిధులకు సూచించారు..

ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అటు కృష్ణా, ఇటు గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.. గోదావరికి వరద పోటెత్తుతుండటంతో రిజర్వాయర్లకు సంబంధించిన ఇన్‌ఫ్లో అవుట్‌ ఫ్లోపై ఎప్పటికప్పుడు అధికారుల నుంచి సమాచారం తీసుకుని తగిన సూచనలు చేస్తున్నారు కేసీఆర్‌.

ముంపు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చేపట్టిన చర్యలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఎగువన మహారాష్ట్ర నుంచి గోదావరికి వచ్చే వరదను అంచనా వేసి చేపట్టాల్సిన చర్యలకు సంబంధించి ఫోన్‌లోనే ఆదేశాలు ఇస్తున్నారు..

కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతోందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.. సాధ్యమైనంత నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని చెప్పారు.. దీంతో ప్రాజెక్టు దిగువన ఉన్న 12 గ్రామాలను ఖాళీ చేయించామన్నారు.. అటు మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి కూడా అక్కడే ఉండి రక్షణ చర్యలను పరిశీలిస్తుండగా.. నిర్మల్‌ సహా వరద ముంపునకు గురవుతున్న పట్టణాల్లో తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం కేసీఆర్‌ సూచించారు.

వరదలకు తెగిపోతున్న రహదారుల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భద్రాచలంలో వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు పలు సూచనలు చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్‌.. అక్కడే ఉండి ఏర్పాట్లు పర్యవేక్షించాలని, ముంపు ప్రాంతాల ప్రజలను తక్షణమే ఖాళీ చేయించాలని సూచించారు.

అటు వరదల కారణంగా పంట నష్టంపై ఎప్పటికప్పుడు అంచనా వేయాలని మంత్రి నిరంజన్‌ రెడ్డిని ఆదేశించారు. ప్రాజెక్టులకు చేరుకుంటున్న వరదను అంచనా వేస్తూ.. అవకాశమున్న చోట హైడల్ ప్రాజెక్టులను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులకు సూచించారు. దేవాదుల ప్రాజెక్టు పనులు జరుగుతుండగా.. వరద నీటిని ఎత్తిపోసేందుకు తక్షణ చర్యలు చేపట్టాలన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా తలెత్తుతున్న సమస్యలపై ఎప్పటికప్పుడు తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎస్‌, డీజీపీలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. వరద ముంపు అధికంగా వున్న జిల్లాల్లోని మంత్రులు, కలెక్టర్లు, అన్ని శాఖల ప్రభుత్వ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పరిస్థితులు చక్కబడే వరకు నియోజకవర్గాలు, జిల్లాలను వదలి వెళ్లకూడదని మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

ఇక భారీ వర్షాల నేపథ్యంలో విద్యా సంస్థలకు మరో మూడు రోజులు సెలవు పొడిగించాలని సూచించగా.. సీఎం ఆదేశాలతో విద్యాశాఖ అధికారులు హుటాహుటిన ఉత్తర్వులు జారీచేశారు.

Tags

Read MoreRead Less
Next Story