తెలంగాణ నీటి వాటాను కొల్లగొట్టాలని చూడొద్దు : సీఎం కేసీఆర్

తెలంగాణ నీటి వాటాను కొల్లగొట్టాలని చూడొద్దు : సీఎం కేసీఆర్
ప్రాజెక్టుల నిర్మాణం, నీటిపంపకాల్లో వివాదాలపై కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ను అధ్యక్షతన వర్చువల్‌గా జరిగిన సమావేశం హాట్‌హాట్‌గా సాగింది. కృష్ణా నదిపై పోతిరెడ్డిపాడు..

ప్రాజెక్టుల నిర్మాణం, నీటిపంపకాల్లో వివాదాలపై కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ను అధ్యక్షతన వర్చువల్‌గా జరిగిన సమావేశం హాట్‌హాట్‌గా సాగింది. కృష్ణా నదిపై పోతిరెడ్డిపాడు తదితర ప్రాజెక్టుల నిర్మాణాలను ఏపీ ప్రభుత్వం ఆపాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఏపీ ప్రాజెక్టులు ఆపకపోతే అలంపూర్‌- పెద్దమారూర్‌ వద్ద ఆనకట్ట నిర్మిస్తామని.. తద్వారా రోజుకు 3 టీఎంసీల సాగునీటిని ఎత్తిపోయడం ఖాయమని స్పష్టం చేశారు. నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసేలా ఏపీ వ్యవహరించొద్దని కోరారు. తెలంగాణ నీటి వాటాను కొల్లగొట్టాలని చూడొద్దని.. ఉమ్మడి రాష్ట్రంలో చేసినట్లు వ్యవహరిస్తే ఇకపై కుదరదని తేల్చి చెప్పారు. తమ రాష్ట్ర రైతుల ప్రయోజనాలను కాపాడుకునేందుకు తామూ సిద్ధమేనని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

నదీజలాల కేటాయింపు కోసం ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయాలని కేంద్రానికి లేఖ రాశామని.. ఏడాదైనా స్పందించనందున సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసినట్లు తెలిపారు.. కృష్ణా నదీ జలాల వివాద ట్రైబ్యునల్‌కు విధివిధానాలు ఇవ్వాలని.. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరపాలని డిమాండ్ చేశారు. బేసిన్‌ అవతలికి కృష్ణా జలాలను తరలించే వీలు ఏపీకి లేదన్నారు. ఇక తెలంగాణలో కొనసాగుతున్న ప్రాజెక్టులేవీ కొత్తవి కావని స్పష్టం చేశారు కేసీఆర్. ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ ప్రాజెక్టుల నిర్మాణం మొదలైందన్నారు. తమకు కేటాయించిన 967.94 టీఎంసీలకు లోబడే గోదావరిపై ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నామన్నారు. తెలంగాణలో నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులన్నీ బహిరంగమేనన్న కేసీఆర్ నిర్మాణ క్రమానికి అనుగుణంగా స్వల్ప మార్పులు చేస్తున్నామని చెప్పారు. అందుకే కొంత సమయం పడుతోందని... డీపీఆర్‌లు సమర్పించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని అన్నారు.. కేంద్రం ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఏపీ ప్రాజెక్టులు కడుతోందని...వీటిని తక్షణమే నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని గజేంద్రసింగ్ షెకావత్‌ను కోరారు కేసీఆర్‌

కరవు ప్రాంతమైన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు శ్రీశైలం నీరే ఆధారమని ఏపీ సీఎం జగన్‌ చెప్పారు. తెలుగు గంగ, ఎస్‌ఆర్‌బీసీ, కేసీ కెనాల్‌, గాలేరు-నగరి శ్రీశైలంపైనే ఆధారపడ్డాయన్నారు. తాగు, సాగునీరు, పారిశ్రామిక అవసరాలకు ఆ నీరే ఆధారమని చెప్పారు. ఈ మేరకు గజేంద్రసింగ్‌ షెకావత్‌కు అందించిన లేఖలో పలు విషయాలు పేర్కొన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆవశ్యకతను సీఎం వివరించారు. థార్‌ ఎడారి తర్వాత అతితక్కువ వర్షపాత ప్రాంతం గల జిల్లా అనంతపురం అని.. ఎడారి అభివృద్ధి పథకం కూడా ఈ జిల్లాలో అమలవుతోందని చెప్పారు. కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలూ దుర్భిక్ష ప్రాంతాల అభివృద్ధి పథకంలో ఉన్నాయన్నారు. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు కనీసం 600 టీఎంసీలు అందించాల్సి ఉంటుందన్నారు. ఈ అంశాలపై గతేడాది జూన్‌లో జరిగిన భేటీలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ అంగీకారం తెలిపినట్లు జగన్‌ గుర్తు చేశారు. 8 జిల్లాలకు కీలకమైన శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలు ఏపీకి అప్పగించాలని డిమాండ్ చేసిన జగన్ నీటి ప్రయోజనాల విషయంలో ఏమాత్రం రాజీపడబోమని స్పష్టం చేశారు.

కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై నిర్ణయాధికారం కేంద్రానిదే అని షెకావత్‌ స్పష్టంచేశారు. ఈ విషయాన్ని కేంద్రం త్వరలోనే నిర్ణయిస్తుందని తెలిపారు. నదీజలాల పంపిణీపై రెండు రాష్ట్రాల ప్రతిపాదనలను తీసుకుని ట్రైబ్యునల్‌కు పంపిస్తామని తెలిపారు. నీటి ప్రాజెక్టులకు అనుమతిచ్చే అధికారం అపెక్స్‌ కౌన్సిల్‌కు ఉందని చెప్పారు. వీలయితే ఈ నెలాఖారులో పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తానని షెకావత్‌ అన్నారు. ఏడాదికి ఒకసారైనా అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించేలా చూస్తామని వివరించారు. కృష్ణా బోర్డు కార్యాలయం విజయవాడకు తరలించేందుకు సమావేశంలో అంగీకారం కుదిరింది. ఇక ట్రైబ్యునల్‌ ద్వారానే తెలంగాణకు నీరు కేటాయించాలని అవసరమైతే నదీజలాలపై సుప్రీంకోర్టులోని కేసును వెనక్కి తీసుకుంటామని సీఎం కేసీఆర్ చెప్పారు. తెలంగాణ కేసు ఉపసంహరించుకున్నాక న్యాయపరమైన అంశాలను పరిశీలించి ముందుకెళ్తామని షెకావత్‌ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story