ఉద్యానవన, మార్కెటింగ్ శాఖలపై సీఎం కేసీఆర్ సమీక్ష

ఉద్యాన పంటల సాగు విస్తరించేలా పరిశోధనలు జరగాలని.. నేలలు, వాతావరణానికి అనుగుణంగా హార్టికల్చరల్ విధానం ఉండాలని సీఎం కేసీఆర్ అన్నారు. ఉద్యానవన, మార్కెటింగ్ శాఖలపై ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. హార్టికల్చరల్ వర్సిటీని బలోపేతం చేయాలన్నారు. ఈ మేరకు ఆధునిక పద్ధతుల్లో ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించేందుకు సెంటర్ ఫర్ ఎక్సలెన్సీని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 300 ఎకరాలు కేటాయించనున్నట్లు సీఎం వెల్లడించారు.
అంతేకాకుండా ఉద్యాన వర్సిటీలో మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్‌లో నిధులను కేటాయించనున్నట్లు చెప్పారు. వంటిమామిడి, రామగిరి ఖిల్లా అగ్ని పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్ల సంఖ్యను పెంచనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. గజ్వేల్ తరహాలోనే కూరగాయల మార్కెట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని మున్సిపాలిటీలు, ముఖ్య పట్టణాల్లో సమీకృత మార్కెట్లు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com