మోదీకి శుభాకాంక్షలు తెలుపుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ

మోదీకి శుభాకాంక్షలు తెలుపుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ

ఢిల్లీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోయే సెంట్రల్ విస్టాకు శంఖుస్థాపన చేయనున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. గొప్ప ప్రాజెక్టు అయిన సెంట్రల్ విస్టా దేశానికి గర్వకారణంగా నిలుస్తుందని సీఎం కొనియాడారు. దేశ రాజధానిలో ప్రభుత్వ కార్యాలయాల సముదాయం అవసరాలకు తగినట్లుగా లేకపోవడమే కాకుండా, అవి వలస పాలనకు గుర్తుగా ఉన్నాయ‌ని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో ఇలాంటి నిర్మాణం అవసరం ఎప్పటి నుంచో ఉందని లేఖలో పేర్కొన్నారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు ఆత్మగౌరవానికి, ప్రతిష్టకు, పునరుజ్జీవనానికి, పటిష్టమైన భారతదేశానికి చిహ్నంగా నిలుస్తుందని అన్నారు సీఎం కేసీఆర్.. జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు.

పార్లమెంట్‌ కొత్త భవన సముదాయానికి గురువారం ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. పార్లమెంటు, కేంద్ర మంత్రిత్వ శాఖల భవనాల నిర్మాణానికి దిల్లీలో ప్రతిపాదించిన 'సెంట్రల్‌ విస్టా' అభివృద్ధి ప్రాజెక్టు శంకుస్థాపనకు సుప్రీంకోర్టు ఇప్పటికే అనుమతించింది. అయితే, ఇప్పుడే ఎలాంటి నిర్మాణాలు, కూల్చివేతలు చేపట్టొద్దని ఆదేశించింది. ఈ ప్రాజెక్టు మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ పూర్తయ్యే వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని ధర్మాసనం గతంలో స్పష్టం చేసింది. అప్పటి వరకు అనుమతుల వంటి డాక్యుమెంటేషన్‌ పని పూర్తి చేసుకోవచ్చని సూచించింది.



Tags

Read MoreRead Less
Next Story