Top

నీటిని తరలించుకుపోతుంటే కృష్ణాబోర్డు ఏం చేస్తోంది? : సీఎం కేసీఆర్

అంతర్ రాష్ట్ర నదీజలాల వివాద చట్టం 1956 సెక్షన్-3 కింద తెలంగాణ ఫిర్యాదును ఏడేళ్లుగా ట్రిబ్యునల్‌కు నివేదించకుండా కేంద్రం తాత్సారం చేయడాన్ని సీఎం కేసీఆర్ తప్పుబట్టారు..

నీటిని తరలించుకుపోతుంటే కృష్ణాబోర్డు ఏం చేస్తోంది? : సీఎం కేసీఆర్
X

అంతర్ రాష్ట్ర నదీజలాల వివాద చట్టం 1956 సెక్షన్-3 కింద తెలంగాణ ఫిర్యాదును ఏడేళ్లుగా ట్రిబ్యునల్‌కు నివేదించకుండా కేంద్రం తాత్సారం చేయడాన్ని సీఎం కేసీఆర్ తప్పుబట్టారు. కేంద్రం నిర్లక్ష్యం కారణంగా కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా తెలంగాణ ఇప్పటిదాకా పొందలేకపోయిందని అన్నారు. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాశారు. అత్యున్నత స్థాయి పాలనా యంత్రాంగం, జల వనరులశాఖ నిపుణులు, అధికారులు... రెండు రోజులు శ్రమించి... సీఎం కేసీఆర్ సూచనలతో ఈ లేఖను సిద్ధం చేశారు. రెండు రాష్ట్రాల మధ్య జల పంపిణీని సుగమం చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం.... వివాదాలకు ఆజ్యం పోసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే తమ ఫిర్యాదును సెక్షన్-3 కింద ట్రిబ్యునల్‌కు నివేదించాలని కోరారు.

పోతిరెడ్డిపాడు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా కృష్ణా జలాలను కృష్ణా బేసిన్ అవతల ఉన్న ప్రాంతాలకు పెద్దఎత్తున తరలించుకుపోతుంటే... కృష్ణా నదీ జలాల యాజమాన్యబోర్డు ఏం చేస్తోందని లేఖలో కేసీఆర్‌ ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడును 80వేల క్యూసెక్కుల సామర్థ్యానికి విస్తరించడాన్ని ప్రస్తావించారు. రోజుకు 3 టీఎంసీలు తరలించడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఏపీ ప్రభుత్వం అక్రమంగా తీసుకుంటున్న చర్యలను కేఆర్ఎంబీ నిరోధించలేక పోవడాన్ని లేఖలో ఎత్తిచూపారు. తక్షణమే పోతిరెడ్డిపాడు నుంచి అక్రమ నీటి తరలింపును ఆపడానికి కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. శ్రీశైలం దిగువన ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు అవసరమైన సాగునీటితో పాటు, హైదరాబాద్ నగరానికి తాగునీటి కోసం ఇబ్బందులు రాకుండా చూడాలని కేంద్రాన్ని కేసీఆర్ కోరారు.

తెలంగాణ రాష్ట్రం గోదావరి మీద నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేయడాన్ని లేఖలో కేసీఆర్ ఎద్దేవా చేశారు. ఉమ్మడి రాష్ట్రం గోదావరి జలాల్లో తెలంగాణకు కేటాయించిన 967.94 టీఎంసీలలో నుంచే ఈ ప్రాజెక్టుల ద్వారా నీటిని వినియోగించుకుంటున్నామని చెప్పారు. ఇవేవీ కొత్తవి కావని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి చేసిన ఫిర్యాదు, పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులపై దృష్టిని మరల్చేందుకు వేసిన ఎత్తుగడగానే తాము భావిస్తున్నామని స్పష్టం చేశారు. గోదావరిపై తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులేవీ కొత్తవి కావని, అవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రారంభించినవేనని సీఎం కేసీఆర్ కేంద్రానికి రాసిన లేఖలో ఆధారాల్ని వివరించారు.

Next Story

RELATED STORIES