REVANTH: చర్లపల్లిలో చిప్పకూడు తినాల్సిందే...

REVANTH: చర్లపల్లిలో చిప్పకూడు తినాల్సిందే...
ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు.. కొంతమంది ఫోన్‌లు విన్నామని కేటీఆర్ వ్యాఖ్యలపై ఆగ్రహం

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌లతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ట్యాపింగ్ పై KTR చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన CM మాజీమంత్రి బరితెగించి మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వాల్మీకి బోయలతో సమావేశమైన రేవంత్ .. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు ప్రజలు కాంగ్రెస్ ను ఆశీర్వదించాలని కోరారు. మహబూబ్ నగర్ , నాగర్ కర్నూల్ ఎంపీ స్థానాలను గెలుచుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.భాజపా భారాస కుమ్మక్కై కాంగ్రెస్ ను ఓడించాలని కుట్రలకు పాల్పడుతున్నాయని రేవంత్ దుయ్యబట్టారు.


గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ చేసి .. భార్యాభర్తలు ఏం మాట్లాడుకున్నారో కూడా విన్నారని రేవంత్‌ అన్నారు. ట్యాపింగ్‌ చేసి వింటే ఏమవుతుందని కేటీఆర్‌ మాట్లాడుతున్నారని... ట్యాపింగ్‌ చేసిన వారు జైలులో చిప్పకూడు తినాల్సి వస్తుందని రేవంత్‌ మండిపడ్డారు. కేటీఆర్‌ బరితెగించి మాట్లాడుతున్నారని.. తగిన ఫలితం ఉంటుందన్నారు. ట్యాపింగ్‌పై విచారణ జరుగుతోంది.. తప్పకుండా చర్యలు ఉంటాయి. అధికారులకు ఆ రోజే చెప్పా.. వినలేదని... ఇవాళ జైలుకు వెళ్తే.. అటు వైపు చూడటం లేదన్నారు. ఓటు విలువ తెలుసని.... అందుకే ఢిల్లీ నుంచి వచ్చి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశా. లోక్‌సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ నుంచి వంశీచంద్‌రెడ్డి, నాగర్‌ కర్నూల్‌ నుంచి మల్లు రవిని భారీ మెజార్టీతో గెలిపించాసలని రేవంత్‌రెడ్డి కోరారు.

మరోవైపు AICC మేనిఫెస్టోలో ఉన్న అయిదు న్యాయ్ గ్యారంటీలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ లో కష్టపడినవారికి సముచిత స్థానం కల్పిస్తున్నామని ఇప్పటికే కొందరికి నామినేటెడ్ పదవులు ఇచ్చామని చెప్పారు. గాంధీభవన్ లో TPCC ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలోరేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క దీపాదాస్ మున్షి, ఏఐసీసీ కార్యదర్శులు, మంత్రులు, పీఈసీ సభ్యులు పాల్గొన్నారు. ఏప్రిల్ 6న తుక్కుగూడలో జనజాతర సభ ఏర్పాట్లపై సమీక్షించారు. కేంద్రంలో తెలంగాణకు సంబంధించిన పెండింగ్ పనులపై మేనిఫెస్టోలో చేర్చాలని నిర్ణయించారు. శ్రీధర్ బాబు నేతృత్వంలోని మేనిఫెస్టో కమిటీకి సలహాలు ఇవ్వాలని, నియోజకవర్గాల వారీగా ఇంఛార్జీలను నియమించి ప్రచార కార్యక్రమాలను చేపట్టాలని తీర్మానించారు. తెలంగాణలో ప్రజల్లో వంద రోజుల పాలనపై సానుకూల స్పందన ఉందని భట్టి విక్రమార్క తెలిపారు. రైతుబంధు ఇవ్వలేదని తప్పుడు ప్రచారంచేస్తున్నారని ఆరోపించిన భట్టి.. ఇప్పటికే 64 లక్షల 75 వేలమంది రైతులకు 5 వేల 500 కోట్ల రైతు బంధు సొమ్ము పంపిణీ చేసినట్టు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story