CM Revanth Reddy: వ్యవసాయ భూములకే రైతుబంధు సాయం..రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: వ్యవసాయ భూములకే రైతుబంధు సాయం..రేవంత్ రెడ్డి
రైతుల పంట రుణాలను బ్యాంకులకు ప్రభుత్వమే చెల్లిస్తుందన్నతెలంగాణ సిఎం

వ్యవసాయ రుణమాఫీపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు. ఇప్పటికే ఈ విషయమై బ్యాంకర్లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. వాస్తవాలకు దగ్గరగా బడ్జెట్‌ ఉందన్న రేవంత్‌ రెడ్డి గత ప్రభుత్వం మాదిరి అబద్దాల పద్దు ప్రతిపాదించలేదని స్పష్టం చేశారు. విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా మేడిగడ్డపై చర్యలు ప్రారంభించామన్న సీఎం మేడిగడ్డ అక్రమాలపై న్యాయవిచారణ తర్వాత నిజానిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. ప్రతి అంశం అసెంబ్లీలో చర్చించిన తరువాత నిర్ణయాలు ఉంటాయన్న సీఎం రేవంత్‌ రెడ్డి అర్హులందరికీ రైతుబంధు అందిస్తామని భరోసా ఇచ్చారు.


ప్రాధాన్యతల ఆధారంగా వాస్తవిక బడ్జెట్‌ను ఉభయసభల్లో ప్రవేశపెట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. భారాస సర్కార్‌ హయాంలోలా అబద్దాల బడ్జెట్‌ తమది కాదని స్పష్టం చేశారు. బడ్జెట్‌ అనంతరం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన సీఎం రేవంత్‌ రెడ్డి అనేక అంశాలను ప్రస్తావించారు. గత ఆర్ధిక సంవత్సరం 2.95లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టగా దానిని సవరించగా 2022-23 ఆర్థిక ఏడాదిలో 2,24,625 కోట్లకు తగ్గిందన్న సీఎం రేవంత్‌ రెడ్డి గత ప్రభుత్వం 23శాతం అదనంగా ప్రవేశ పెట్టినట్లు వ్యాఖ్యానించారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌పై ప్రసంగించేందుకు సుదీర్ఘంగా కసరత్తు చేశారని... ఇందువల్లనే వార్షిక బడ్జెట్‌ గత ప్రభుత్వం మాదిరి అబద్దాల బడ్జెట్‌ కాదని స్పష్టం చేశారు. గత సర్కార్‌ చేసిన పాపం కారణంగా సాగునీటి ప్రాజెక్టులకు తెచ్చిన అప్పులకు 16వేల కోట్ల రూపాయల వడ్డీలు కట్టాల్సి వస్తోందని సీఎం వ్యాఖ్యానించారు. రైతు రుణమాఫీ విషయమై ఇప్పటికే బ్యాంకులతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందని త్వరలో మాఫీ చేస్తామని వెల్లడించారు.

మహిళల సంక్షేమానికి తమ ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేసిన సీఎం సాగునీటి శాఖపై శ్వేతపత్రం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. మేడిగడ్డపై అందిన విజిలెన్స్‌ విచారణ నివేదిక ఆధారంగా ఇద్దరు ఉన్నతాధికారులపై చర్యలు తీసుకున్నామన్న రేవంత్‌ రెడ్డి... జ్యూడీషియల్ విచారణలో నిజానిజాలు బయటికి వస్తాయని పేర్కొన్నారు . అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్న రేవంత్‌ రెడ్డి... కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటా నిధులతోపాటు అదనంగా అడిగి తెచ్చుకుంటామన్నారు. శాసనసభ సమావేశాలు పొడిగింపు తమ చేతుల్లో లేదని... సభాపతి పరిధిలో అంశమని స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story