CM Revanth Reddy: మెగా డీఎస్సీ ద్వారా టీచర్లను భర్తీ చేయాలి

CM Revanth Reddy: మెగా డీఎస్సీ ద్వారా టీచర్లను భర్తీ చేయాలి
పోస్టులు చూపిస్తేనే మెగా డీఎస్సీ

రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీలు ఉండకూడదన్న ముఖ్యమంత్రి ఆదేశాలతో మెగా డీఎస్సీకి విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. గత ప్రభుత్వహయాంలో 5 వేల 89 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వెలువడగా... ప్రస్తుతం ఉన్నవారికి పదోన్నతులు కల్పిస్తే మరో 9 వేల కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తంగా 19 నుంచి 20 వేల ఉపాధ్యాయుల భర్తీకి నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉందని భావిస్తోంది.

మెగా DSC నిర్వహణపై విద్యాశాఖ కసరత్తు మొదలుపెట్టింది. ప్రతిపాఠశాలలో ఉపాధ్యాయులు ఉండాలని టీచర్లు లేరంటూ మూసివేసిన చోట అవసరమైన మేరకు నియామకాలు జరపాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. పదోన్నతులు సత్వరమే పూర్తిచేసి తద్వారా ఏర్పడే ఖాళీలను భర్తీ చేయాలని సూచించడంతో అధికారులు లెక్కలు తీస్తున్నారు. ఈసారి DSC నిర్వహణ సజావుగా జరిగేలా న్యాయపర సలహాలు తీసుకొని ముందుకెళ్లాలని అధికారులు భావిస్తున్నారు. శనివారం ముఖ్యమంత్రి సమీక్షలో ఖాళీలు, ఉపాధ్యాయులులేని పాఠశాలలు పదోన్నతుల ప్రక్రియ హేతుబద్ధీకరణకి చెందిన అంశాలను అధికారులు నివేదించారు. గతప్రభుత్వ హయాంలో 5,089 పోస్టుల భర్తీకి డీఎస్సీ నిర్వహణకు నోటిఫికేషన్‌ జారీచేశారు. అప్పుడు స్కూల్‌అసిస్టెంట్‌ 1,739 భాషాపండిట్లు 611, వ్యాయామ ఉపాధ్యాయులు 164, SGT 2వేల 575 పోస్టులు ఖాళీలుగా చూపారు. గత ఏడాది ఆగస్టు వరకు ఆ పోస్టులు లెక్కతేలాయి. టెట్‌ ఉత్తీర్ణులైన వారికే పదోన్నతులు కల్పించాలనే నిబంధన దృష్ట్యా ఇప్పటికే ఉపాధ్యాయులకు పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోయిఉంది. ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు... టెట్‌ నిర్వహించి పదోన్నతులు ఇవ్వడం ద్వారా మరో 9 వేల వరకు ఖాళీలు తేలే అవకాశం ఉంది. వాటన్నిటినీ DSC చేర్చాలని విద్యాశాఖ అధికారులు తెలిపారు. వచ్చే మార్చి నుంచి ఉపాధ్యాయుల పదవీ విరమణలో ఖాళీ అయ్యే పోస్టులనూ కలపాల్సిఉంటుంది. ఆ లెక్కన 19 వేల నుంచి 20 వేల వరకు పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు లెక్కలు వేస్తున్నారు.

డీఎస్సీ నిర్వహణకు అవసరమైన కసరత్తు వారంనుంచి 15 రోజుల్లో పూర్తిచేసి సీఎంకు నివేదించాలని విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. నివేదిక అందిన తర్వాత మరోసారి ముఖ్యమంత్రితో సమావేశమయ్యాక తేదీలపై స్పష్టత రానుంది. తొలుత ఉపాధ్యాయ పదోన్నతులకోసం విధిగా టెట్‌ నిర్వహించాల్సి ఉంటుంది. టెట్‌ నిర్వహణలో జాప్యంఉంటే పదోన్నతుల ద్వారా ఏర్పడే ఖాళీలను ముందే గుర్తించి వాటినీ కలిపి DSC నిర్వహించే అవకాశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. సెప్టెంబర్‌లో ఇచ్చిన నోటిఫికేషన్‌కు లక్ష 72 వేల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి ఆ సంఖ్య మరింత పెరిగే వీలుంది. ఫిబ్రవరి లేదా మార్చిలో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే వీలుంది. ఆ లోగా డీఎస్సీ నిర్వహించాలంటే అన్ని రకాలుగా సన్నద్ధం కావాలనిఎలాంటి ఆటంకాలు లేకుండా న్యాయపరమైన సలహాలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌ కొనసాగించి... పోస్టులు, గడువు పెంచి కొనసాగించే అవకాశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story