Dharani Portal: 'ధరణి' పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలి..

Dharani Portal:  ధరణి పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలి..
అధికారులకు సీఎం ఆదేశం

ధరణిలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. మార్చి మొదటి వారంలోనే..అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో పెండింగు దరఖాస్తులను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ధరణి కమిటీ సూచనల మేరకు పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి విధి విధానాలను రూపొందించాలని రెవిన్యూ శాఖను ఆదేశించారు. సచివాలయంలో ధరణి కమిటీతో రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. 2020లో అమల్లోకి వచ్చిన ఆర్వోఆర్ చట్టంలోనే లోపాలున్నాయని ధరణి కమిటీ ముఖ్యమంత్రికి వివరించింది.

కేవలం 3 నెలల్లో హడావుడిగా భూ సమగ్ర సర్వే చేసి ఆ రికార్డులను ప్రామాణికంగా తీసుకోవటంతో సమస్యలు, రికార్డుల వివాదాలు పెరిగాయని... కమిటీ సభ్యులు తెలిపారు. లక్షలాది సమస్యలు తలెత్తాయని..కనీసం పేర్లలో చిన్న అక్షర దోషాలున్నా జిల్లా కలెక్టర్ వరకు వెళ్లాల్సి వస్తోందన్నారు. ధరణి లోపాలను సవరించాలంటే చట్టానికి సవరణ లేదా కొత్త చట్టం చేయటం తప్ప మరో మార్గం లేదని వివరించారు. ధరణి కమిటీ తుది నివేదిక ఆధారంగా రైతుల భూరికార్డుల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని రేవంత్ తెలిపారు. అవసరమైతే చట్ట సవరణ లేదా కొత్త చట్టం తెచ్చే అంశాలను పరిశీలిద్దామన్నారు. ధరణిలో లోపాలు, సమస్యలను మరింత లోతుగా అధ్యయనం చేయాలని కమిటీని కోరారు. ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న ఏజెన్సీపై సమగ్ర విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సీసీఎల్ఏ నిర్వహించాల్సిన ధరణి పోర్టల్‌ను ప్రైవేటు ఏజెన్సీలకు ఎందుకు అప్పగించారని ప్రశ్నించారు. గోప్యంగా ఉండాల్సిన భూముల డేటా, ఆధార్, బ్యాంకు ఖాతాల వివరాలు విదేశీ ఏజెన్సీ చేతుల్లో పెట్టడాన్నిరేవంత్‌ రెడ్డి తప్పు బట్టారు. గత ప్రభుత్వం 2018లో టెక్నికల్, ఫెనాన్సియల్ బిడ్డింగ్, అర్హతల ఆధారంగా ఐఎల్ఎఫ్ఎస్ అనే కంపెనీకి ధరణి పోర్టల్ డిజైన్ అభివృద్ధిని అప్పగించిందని అధికారులు సీఎంకు తెలిపారు. ఆ కంపెనీ దివాళా తీసిందని తర్వాత టెర్రాసిస్ అని పేరు మారడం సహా డైరెక్టర్లందరూ మారిపోయారని వివరించారు. అనంతరం వాటాలు అమ్ముకొని ఫాల్కాన్ ఇన్వెస్టెమెంట్ కంపెనీకి నిర్వహణ మారిందని సీఎంకు తెలిపారు. బిడ్ దక్కించుకున్న కంపెనీ మారిపోతే ప్రభుత్వం ఎలా అంగీకరించిందని రేవంత్ అడిగారు. భూముల రికార్డుల డేటాను విదేశీ కంపెనీలకు అప్పగించేందుకు నిబంధనలు అంగీకరిస్తాయా అని ప్రశ్నించారు. ధరణి టెండరును 2018లో 116 కోట్ల రూపాయలకు దక్కించుకున్న కంపెనీ తమ వాటాలను దాదాపు 1200 కోట్లకు అమ్ముకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. రికార్డులన్నీ వాళ్ల దగ్గరే ఉన్నందున విలువైన భూముల యాజమాన్య పేర్లు మార్చుకోలేదని గ్యారంటీ ఏమిటిని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కొన్ని సందర్భాల్లో అర్ధరాత్రి కూడా భూముల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయని ధరణి పోర్టల్ నిర్వహణపై నియంత్రణ, అజమాయిషీ లేదా అని సీఎం రెవిన్యూ అధికారులను ప్రశ్నించారు.

Tags

Read MoreRead Less
Next Story