TS: అవినీతి దందగా ఇసుక పాలసీ

TS: అవినీతి దందగా ఇసుక పాలసీ
కొత్త విధానాన్ని తయారు చేయాలని రేవంత్‌రెడ్డి ఆదేశం....ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని ఆదేశం

తెలంగాణలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఇసుక పాలసీ అవినీతి దందాగా మారిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలకు ప్రయోజనం, ప్రభుత్వానికి ఆదాయం ఉండేలా..కొత్త ఇసుక విధానాన్ని తయారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తదితర రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని... రేవంత్ రెడ్డి సూచించారు. సచివాలయంలో గనులు, భూగర్భ వనరుల శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇసుక తవ్వకాలు, రవాణ, అమ్మకాల్లో అడుగడుగునా అక్రమాలు జరుగుతున్నాయని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఇసుక క్వారీయింగ్, అక్రమ రవాణాను వెంటనే అరికట్టాలని స్పష్టం చేశారు. విజిలెన్స్, ఏసీబీ విభాగాలను రంగంలోకి దింపి..అన్ని జిల్లాల్లో తనిఖీలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.


ఇసుక అక్రమాలకు పాల్పడుతున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టవద్దని రేవంత్‌రెడ్డి సూచించారు. టోల్ గేట్ల వద్ద నమోదైన డేటా ఆధారంగా ఇసుక లారీల అక్రమ రవాణా బయటకు తీయాలన్నారు. ఇసుక రీచ్‌లు, డంపులన్నీ తనిఖీలు చేసి అక్రమాలకు గుర్తిస్తే జరిమానాలతో సరిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక రీచ్ ల వద్ద సీసీ కెమెరాలున్నాయన్న అధికారుల సమాధానంపై.. సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు పాదయాత్రగా వెళ్లినప్పుడు... మానేరు వాగులో తనుగుల ఇసుక క్వారీకి వెళ్లగా అక్కడ CCకెమెరాలేలేవని సీఎం చెప్పారు. ఈనెల3ననిజామాబాద్, వరంగల్ రూట్లలో రవాణ శాఖతో ఆకస్మిక తనిఖీలు చేయించగా..... 83 ఇసుక లారీల్లో 22 లారీలకు అనుమతి లేదని తేలిందన్నారు. ఒకే పర్మిట్, ఒకే నెంబరుతో..నాలుగైదు లారీలు ఇసుక రవాణా చేస్తున్నట్లు బయటపడిందన్నారు.


25 శాతం ఇసుక అక్రమంగానే తరలిపోతుందని రేవంత్‌ చెప్పారు. అధికారులు 48 గంటల్లో తమ పద్ధతి మార్చుకోవాలని సీఎం హెచ్చరించారు. TSMDC కేంద్రంగా జరుగుతున్న అక్రమాలను అరికట్టి గనులు, భూగర్భ వనరుల విభాగాన్ని..సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరముందన్నారు. నూతన ఇసక పాలసీని తయారు చేయాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ పరిసరాల్లో అనుమతిలేని స్టోన్ క్రషర్స్ వెంటనే సీజ్ చేయాలని ముఖ్యమంత్రి తేల్చిచెప్పారు. భవనాల కోసం సెల్లార్లు ఆరు మీటర్లకన్నా ఎక్కువగా తవ్వితే.. నిబంధనల ప్రకారం పన్ను వసూలు చేయాలని ఆదేశించారు. భారీ భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేటప్పుడే..గనులు, భూగర్భ వనరుల శాఖకు ఆ వివరాలు చేరేలా.. సమీకృత ఆన్ లైన్ విధానం అమలు చేయాలని సూచించారు. గ్రానైట్, ఖనిజాల తవ్వకాలు,అక్రమరవాణాను అరికట్టేందుకు.. జియో ట్యాగింగ్, జీపీఆర్ఎస్ ను వినియోగించాలని సీఎం సూచించారు. గ్రానైట్, ఇతర క్వారీలపై నమోదైన కేసులు, దర్యాప్తు పురోగతి తదితర వివరాలతో.. నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు.

Tags

Read MoreRead Less
Next Story