TS: కేంద్ర నిధులపై తెలంగాణ దృష్టి

TS:  కేంద్ర నిధులపై తెలంగాణ దృష్టి
బకాయిలు సహా కేంద్ర నిధులు పొందడంపై కసరత్తు.... కేంద్రమంత్రులను కలవనున్న రేవంత్‌రెడ్డి

కేంద్ర ప్రభుత్వం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు రాబట్టుకోవడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. బకాయిలు సహా వివిధ రూపాల్లో వచ్చే నిధులను పొందేలా కసరత్తు చేస్తోంది. ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులను కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక విజ్ఞాపన చేయనున్నారు. ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న తెలంగాణ ప్రభుత్వం నిధుల సమీకరణపై దృష్టి సారించింది. ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు రాబట్టుకునేలా కసరత్తు చేస్తోంది. బడ్జెట్ రూపకల్పన సమయంలోనే సీఎంరేవంత్‌రెడ్డి అధికారులకు ఆ విషయంపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. కేంద్రం నుంచి, ప్రత్యేకంగా కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా వచ్చే నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా తెలంగామ వాటా కేటాయించి, విడుదల చేయడం ఎప్పటికప్పుడు యూసీలు సమర్పించాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో ప్రతిపాదనలు రూపొందించారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గ్రాంట్ల రూపంలో 21వేలకోట్లకు పైగా వస్తాయని అంచనా వేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల కింద కనీసం 19 వేల కోట్లు రాబట్టుకోవాలన్న ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది.


ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రధానిని కలిసిన రేవంత్‌రెడ్డి పలు విజ్ఞప్తులు చేశారు. ఆ వెంటనే కేంద్రఆర్థిక సంఘం నిధులు తెలంగాణకు 600కోట్లు వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అదే తరహాలో పెండింగ్ నిధులను కేంద్రం నుంచి పొందడంపై సర్కార్‌ దృష్టి సారించింది. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి బకాయిలు ఇప్పటివరకు రాష్ట్రానికి 1800 కోట్లు రావాల్సి ఉండగా... వచ్చే ఆర్థిక సంవత్సరానికి మరో 450 కోట్లు కలిపితే 2250 కోట్లు అవుతాయి. వాటిన్నింటిపై దిల్లీలో కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చర్చించే అవకాశముంది ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు దిల్లీ వెళ్ళారు. వాటితో పాటు ఇతర అంశాలని కేంద్రం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది.


గత ప్రభుత్వం ఎక్కువ వడ్డీకి తీసుకున్న రుణాలకి... తక్కువ వడ్డీ భారం పడేలా సాఫ్ట్‌లోన్లుగా మార్చడం, రైతు రుణమాఫీ కోసం కార్పొరేషన్ ఏర్పాటు సహా ఇతర అంశాలను కేంద్రమంత్రుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తోంది. పర్యటనలో భాగంగా... కేంద్రఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌, రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ పట్టణాభివృద్ధి శాఖ హర్దీప్‌ సింగ్‌ పూరీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బృందం సమావేశం కానుంది . ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రణదీప్ సింగ్ సుర్జేవాలా కుమారుడు ఆదిత్య వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

Tags

Read MoreRead Less
Next Story