REVANTH: మా సర్కార్‌ను కూల్చే మొగోడు ఎవడు..?

REVANTH: మా సర్కార్‌ను కూల్చే మొగోడు ఎవడు..?
అసెంబ్లీకి వచ్చే దమ్ము లేదు.. మా కళ్లలోకి చూసే ధైర్యం లేదు... రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు

భాగ్యనగరవాసుల ప్రయాణ కష్టాలను తీర్చేందుకు.. సర్కార్‌ మరో ముందడుగు వేసింది. హైదరాబాద్‌లో ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా సర్కారు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా LBనగర్ వద్ద బైరామల్‌గూడ కూడలిలో నిర్మించిన పైవంతెనను ముఖ్యమంత్రి ప్రారంభించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరాన్ని అన్నిరకాలుగా అభివృద్ధి చేస్తామని స్పష్టంచేసిన సీఎం .. అభివృద్ధిని అడ్డుకునే వారికి గట్టి గుణపాఠం చెప్పాలని సూచించారు. ఇప్పటికే పలు వంతెనలు అందుబాటులోకి రాగా.. బైరామల్‌గూడ కూడలిలో 194 కోట్లతో నిర్మించిన పైవంతెనను ముఖ్యమంత్రి ప్రారంభించారు.T 'వైబ్రంట్‌ తెలంగాణ 2050' పేరుతో బృహత్‌ ప్రణాళిక రూపొందించామన్న సీఎం.. త్వరలోనే టెండర్లు పిలిచి ప్రణాళికలు ఆమోదించి ప్రజాభిప్రాయ సేకరణ చేపడతామన్నారు. హైదరాబాద్‌ నగర ప్రజల అవసరాలు తీర్చేలా మెట్రో రైల్‌ సేవలు విస్తరిస్తున్నట్లు తెలిపారు. 360 డిగ్రీల్లో సమాన స్థాయిలో నగర అభివృద్ధి ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు వివరించారు.


మెట్రో విస్తరణకు పునాదిరాయి వేస్తే కాళ్లలో కట్టెపెట్టేలా అడ్డుకుంటున్నారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులకు కొందరు అడ్డుతగులుతున్నారన్న ముఖ్యమంత్రి..అలాంటి వారికి నగర బహిష్కరణ సరి అని సభావేదికగా మండిపడ్డారు. అనంతరం ఉప్పల్ నల్లచెరువు వద్ద ఏర్పాటు చేసిన మురుగునీటి శుద్ది కేంద్రాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. లండన్ తరహాలో.. మూసీ రివర్‌ ఫ్రంట్ డెవలమెంట్ చేపట్టబోతున్నట్లు CM పునరుద్ఘాటించారు. నగరంలోని ప్రతి గల్లీ నుంచి వచ్చే మురుగు నీటిని శుద్ది చేశాకే.. మూసీలోకి వదిలేలా ప్రణాళికలు తయారుచేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ భూముల కబ్జాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని సీఎం ఘాటు హెచ్చరికలు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్‌ పోటీ పడాలంటే...ప్రజలు సహకారించాలని రేవంత్‌రెడ్డి కోరారు.


కార్యకర్తల కష్టంతో.. సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడగొట్టే మొనగాడు ఈ రాష్ట్రంలో ఉన్నాడా!? అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడే దమ్ము లేదని, తమ కళ్లల్లోకి చూసే ధైర్యం లేదని, కానీ, సర్కారు ఆరు నెలల్లో కూల్తదని, మూడు నెలల్లో పోతదని అంటున్నారని కేసీఆర్‌ను ఉద్దేశించి దుయ్యబట్టారు. ‘‘దోచుకుని దాచుకున్న డబ్బుతో ఏమైనా చేయవచ్చనే భ్రమలో ఉన్నవారే ప్రభుత్వాన్ని కూలగొడతామని అంటున్నారు. ఒకవేళ పడగొట్టాలనే ఆలోచన చేస్తే ఇక్కడికి కూతవేటు దూరంలోనే ఫాంహౌజ్‌ ఉంది. కాంగ్రెస్‌ కార్యకర్తలు అనుకుంటే ఫాంహౌజ్‌ గోడలు కాదు ఇటుక పెళ్లలు కూడా మిగలవు బిడ్డా. మా కార్యకర్తలు తలచుకుంటే గొయ్యి తీసి పాతి పెడతారు. మేం మంచోళ్లం కాబట్టే మీరు ఇంకా బజార్లో తిరుగుతున్నారు. ప్రతిపక్షంలోనే భయపడలేదు. ఇప్పుడు అధికారం మాదే. మాతో పెట్టుకుంటే ఒళ్లు చింతపండు అయితది’’ అని హెచ్చరించారు. ప్రజల తరఫున పోరాడినందుకే 64 మంది ఎమ్మెల్యేలతో సంపూర్ణమైన మెజారిటీతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిందని గుర్తు చేశారు. సికింద్రాబాద్‌ నుంచి బోయినపల్లి పాల డెయిరీ వరకూ రూ.1,580 కోట్లతో నిర్మించనున్న డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ను కండ్లకోయ వద్ద సీఎం రేవంత్‌ రెడ్డి శనివారం ప్రారంభించారు.

Tags

Read MoreRead Less
Next Story