Medigadda Project: మేడిగడ్డ కుంగుబాటు కేసును సీబీఐకి అప్పగించండి

Medigadda Project: మేడిగడ్డ కుంగుబాటు కేసును సీబీఐకి అప్పగించండి
హైకోర్టులో పిల్ వేసిన జి.నిరంజన్

మేడిగడ్డ ప్రాజెక్లు పిల్లర్లు కూలడం తెలంగాణలో సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో ఈ అంశం బీఆర్ఎస్ ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకతను తీసుకొచ్చిందనే చెప్పుకోవాలి. మరోవైపు, పిల్లర్ల కుంగుబాటుపై జయశంకర్ జిల్లా మహదేవపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. ఈ కేసును సీబీఐకి బదలాయించాలని హైకోర్టులో పిల్ దాఖలయింది. ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని పీసీసీ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ దాఖలు చేశారు. జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ నవంబర్ 1వ తేదీన ఇచ్చిన నివేదిక ఆధారంగా బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలను జారీ చేయాలని పిటిషన్ లో కోరారు. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ రూ. 86 వేల కోట్లు సేకరించడంపై కూడా సీబీఐతో దర్యాప్తు చేయించాలని విన్నవించారు. ఈ పిటిషన్ ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది.

అసలేం జరిగింది..?

సరిగ్గా నెల రోజుల క్రితం సాయంత్రం తర్వాత ప్రాజెక్ట్ పరిధిలో భారీ శబ్దం వినిపించింది. పేలుడు శ‌బ్దం పెద్ద‌గానే రావ‌డ‌తో ఏం జ‌రిగిందోన‌ని అప్రమత్తం అయ్యారు అధికారులు. అనంత‌రం అక్క‌డ‌కు వెళ్లి చూడ‌గా.. 6వ బ్లాక్‌లోని 20వ ఫిల్ల‌ర్ కొంతమేర కుంగిన‌ట్లు గుర్తించారు. రాత్రి చీకటిపడటంతో… ఏం జరిగిందన్న విషయాన్న అధికారులు స్పష్టంగా గుర్తించలేకపోయారు. వెంటనే బ్యారేజీపై రాకపోకలను నిలిపివేశారు. అయితే బ్యారేజీ 20వ పిల్లర్‌ కుంగడంతోనే పైన వంతెన కుంగినట్లు అంచనా వేస్తున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా…. నాలుగేళ్ల క్రితం ఈ బ్యారేజీ నిర్మాణం పూర్తి చేసుకుంది. దీనిని రివర్స్ పంపింగ్ విధానం ద్వారా నీటిని ఎత్తిపోయడానికి డిజైన్ చేశారు. గోదావరి నదిలోని నీటిని తాగునీరు, నీటి పారుదల కోసం ఉపయోగించుకోవడమే మేడిగడ్డ ప్రధాన లక్ష్యం. లక్ష్మీ బ్యారేజీ పొడవు 1.6 కిలోమీటర్లు ఉండగా…. మహారాష్ట్ర వైపు నుంచి 356 మీటర్ల సమీపంలో ఉంది. తాజా ఘటనతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story