జీహెచ్ఎంసి ఎన్నికలపై దృష్టి సారించిన కాంగ్రెస్ పార్టీ

జీహెచ్ఎంసి ఎన్నికలపై దృష్టి సారించిన కాంగ్రెస్ పార్టీ
దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలు ముగియడంతో గ్రేటర్ ఎన్నికలపై దృష్టి సారించింది కాంగ్రెస్ పార్టీ . తెలంగాణ రాష్ట్రానికి తలమానికమైన హైదరాబాద్‌లో పార్టీని బలోపేతం చేసే దిశగా..

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలు ముగియడంతో గ్రేటర్ ఎన్నికలపై దృష్టి సారించింది కాంగ్రెస్ పార్టీ . తెలంగాణ రాష్ట్రానికి తలమానికమైన హైదరాబాద్‌లో పార్టీని బలోపేతం చేసే దిశగా రాష్ట్ర నాయకత్వం అడుగులు వేస్తోంది. దుబ్బాక ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అంత కలిసికట్టుగా పని చేసినట్లుగానే.. గ్రేటర్‌ ఎన్నికల్లోనూ దూకుడుగా వ్యవహరించాలని కాంగ్రెస్ భావిస్తోంది..

గ్రేటర్‌లో డివిజన్ల వారిగా తమ బలాబలాలను అంచనా వేసుకుంటూ... పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాలను బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపకల్పన చేస్తోంది కాంగ్రెస్ . ఇప్పటికే డివిజన్ల పరిధిలో వివిధ విభాగాలకు చెందిన కమిటీల ఏర్పాటు పూర్తి చేసిన కాంగ్రెస్ నేతలు … ఇంకా పెండింగ్ ఉన్న కమిటీల నియామకంపై ప్రత్యేక దృష్టి సారించారు. మరోవైపు పార్టీ డివిజన్ ఇంచార్జ్ లతో సమావేశం నిర్వహిస్తూ... ఎన్నికల సందర్భంగా స్థానికంగా పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. మల్కాజ్ గిరి లోక్‌సభ నియోజక వర్గం పరిధిలోని నగరపాలక సంస్థల డివిజన్ల పార్టీ అధ్యక్షులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. గ్రేటర్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని, అభ్యర్థులు ఎవరనేది పక్కన పెట్టి అంతా కలిసికట్టుగా కృషి చేసి గెలిపించాలని ముఖ్యనేతలు క్యాడర్‌కు దిశానిర్దేశం చేస్తున్నారు.

ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను అప్రమత్తం చేసి చురుకైన పాత్ర పోషించే దిశలో పీసీసీ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. గ్రేటర్ లో అన్ని డివిజన్లకు చెందిన పార్టీ సీనియర్ నాయకులతో సమీక్ష లు నిర్వహిస్తూ స్థానికంగా ఏలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా పార్టీ బలోపేతం అవుతుందన్న అంశంపై సలహాలు తీసుకుంటోంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా మాణికం ఠాగూర్ నియామకం అయ్యాక పార్టీ పనితీరులో సమూల మార్పులు చోటు చేసుకున్నాయి. పార్టీలో ఐక్యత తీసుకు రావడంతోపాటు రాష్ట్ర నాయకత్వాన్ని పరుగులు పెట్టిస్తున్నారు ఆయన. పార్టీ లో ఉన్న అసంతృప్తులను కూడా కలగలపుకుని ముందుకెళుతున్నారు. గ్రేటర్ లో ఏ ఒక్క నాయకుడు చేజారకుండా చూసుకుంటూ పార్టీని బలోపేతం చేస్తూ .. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ముందుకెళుతోంది.

Tags

Read MoreRead Less
Next Story