CONGRESS: కాంగ్రెస్‌ రెండో జాబితాకు నేడు ఆమోదముద్ర!

CONGRESS: కాంగ్రెస్‌ రెండో జాబితాకు నేడు ఆమోదముద్ర!
ఇవాళ 64 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేందుక కసరత్తు... ఆశావహుల్లో ఉత్కంఠ

తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితాకు నేడు జరిగే సమావేశంలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. మొదటి జాబితాలో 55మంది అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించిన కాంగ్రెస్ ఇవాళ(బుధవారం) మిగిలిన 64 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే ఇవాళ మధ్యాహ్నం సమావేశం కానున్న కమిటీ 64 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా సూర్యాపేట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, అంబర్ పేట, LB నగర్ ,నర్సాపుర్ తదితర స్థానాల్లో ఇద్దరు సముజ్జీలు ఉండడం, ఏకాభిప్రాయం కుదరనందున..ఎటూ తేల్చుకోలేని స్క్రీనింగ్ కమిటీ.. రెండేసి పేర్లను కేంద్ర ఎన్నికల కమిటీకి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.


మరోవైపు నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశిస్తున్న TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్‌గౌడ్ కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. వెంటనే ఢిల్లీ బయలుదేరిన మహేశ్ కుమార్ సీటుపై ఇవాళ స్పష్టత వస్తుందని అన్నారు. అటు సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు సీట్లను ఖరారు చేసిన కాంగ్రెస్ సీపీఎంకు మిర్యాలగూడ సీటు ఇవ్వడానికి అంగీకరించింది. రెండో స్థానంపై సందిగ్ధత కొనసాగుతోంది. పాలేరు సీటు ఇవ్వకుంటే ఒంటరిగా పోటీ చేస్తామని సీపీఎం ఇప్పటికే తెలిపింది. మొత్తం 64 నియోజకవర్గాలకు చెంది కసరత్తు పూర్తి అయినప్పటికీ చాలా నియోజకవర్గాలలో పోటీ అధికమై అభ్యర్థుల ఎంపికపై ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. వామపక్షాలతో పొత్తులు ఖరారైనప్పటికీ సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రాలేదు. దీంతో ఆ రెండు పార్టీలు ప్రతిపాదిస్తున్న నియోజకవర్గాలను వారికి ఇచ్చేందుకు కాంగ్రెస్ నాయకత్వం సుముఖంగా లేదని తెలుస్తోంది.


సీట్ల సర్దుబాటులో వామపక్షాల నాయకులతో స్థానిక కాంగ్రెస్ నాయకులు సంప్రదింపులు జరిపి సమస్యను పరిష్కరించుకోవచ్చని AICCఆదేశించినట్లు తెలుస్తోంది. మరొకవైపు భాజపా, భారాస నుంచి మరి కొందరు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. బుధవారం దిల్లీలో జరగనున్న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీకి స్క్రీనింగ్ కమిటీ పంపించిన ఒకే పేరు, రెండు పేర్ల జాబితాలకు ఆమోదముద్ర వేసే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఏకాభిప్రాయం కుదిరిన 35 నుంచి 40 నియోజకవర్గాలకు రెండో జాబితాలో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. బుధ, గురువారాల్లో రెండో జాబితా ప్రకటించే అవకాశం ఉందని PCC వర్గాలు అంచనా వేస్తున్నాయి. మిగిలిన నియోజకవర్గాలకు వామపక్షాలతో సీట్ల సర్దుబాటు, చేరికలు పూర్తి అయ్యితే మూడో జాబితాకు అడ్డు తొలిగి పోతుంది.

Tags

Read MoreRead Less
Next Story