Crime: సాత్విక్‌ ఆత్మహత్య ఘటనపై ఇంటర్‌ బోర్డు చర్యలు

Crime: సాత్విక్‌ ఆత్మహత్య ఘటనపై ఇంటర్‌ బోర్డు చర్యలు
వచ్చే విద్యా సంవత్సరం నుంచి నార్సింగి శ్రీచైతన్య కాలేజీ అనుమతి రద్దు

ఇంటర్‌ విద్యార్థి సాత్విక్‌ ఆత్మహత్య ఘటనపై ఇంటర్‌ బోర్డు చర్యలు చేపట్టింది. సాత్విక్‌ చదివిన నార్సింగి శ్రీచైతన్య కాలేజీ అనుమతిని వచ్చే విద్యా సంవత్సరం నుంచి రద్దు చేయాలని నిర్ణయించింది. సాత్విక్‌ ఆత్మహత్య నేపథ్యంలో ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీల యాజమాన్యాలతో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్‌బోర్డు కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌ చర్చలు జరిపారు. తప్పుడు ప్రకటనల నియంత్రణకు కమిటీని ఏర్పాటు చేయాలని ఇంటర్‌బోర్డు నిర్ణయించింది.అదనపు సమయం తరగతులు నిర్వహిస్తే కళాశాలలపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కళాశాలల్లో బయోమెట్రిక్‌ అమలు చేస్తామని ఇంటర్‌బోర్డు కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌ స్పష్టం చేశారు.

నార్సింగిలోని శ్రీచైతన్య కళాశాలలోని తరగతి గదిలో ఇంటర్‌ విద్యార్థి సాత్విక్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి వద్ద లభించిన సూసైడ్‌ నోట్‌ ఆధారంగా పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు. సాత్విక్‌ మృతికి కారకులైన వారిపై 305 సెక్షన్‌ కింద నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో విద్యార్థుల మరణాల నియంత్రణకు ప్రత్యేక సంస్థ లేదా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి బాలల హక్కుల కమిషన్‌ సిఫార్సు చేసింది. ప్రైవేట్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలు, కాలేజీల్లో విద్యార్థుల మరణాలకు దారితీస్తున్న పరిస్థితులను నియంత్రించాలని సర్కారుకు సూచించింది. ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసి దాని పరిధిలోకి ప్రైవేట్ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలను తీసుకురావాలని కమిషన్ సిఫార్సు చేసింది.

Tags

Read MoreRead Less
Next Story