Crime: వరకట్నవేధింపులకు మహిళా కానిస్టేబుల్‌ బలి

Crime: వరకట్నవేధింపులకు మహిళా కానిస్టేబుల్‌ బలి
వరంగల్‌లో దారుణం చోటుచేసుకుంది. వరకట్నవేధింపులకు మహిళా కానిస్టేబుల్‌ బలైంది. ఈ దారుణ ఘటన ఆదివారం చోటు చేసుకుంది.

వరంగల్‌లో దారుణం చోటుచేసుకుంది. వరకట్నవేధింపులకు మహిళా కానిస్టేబుల్‌ బలైంది. ఈ దారుణ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. మహబూబాబాద్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న నాంపల్లి మౌనిక(26)కు శ్రీధర్‌ అనే వ్యక్తితో 2015 వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. మౌనిక ఉరేసుకుందని ఎంజిఎం ఆసుపత్రికి తీసుకొచ్చామని ఆమె అత్త వరలక్ష్మి మౌనిక తల్లిదండ్రులైన రాజేందర్‌,నరసమ్మలకు తెలిపింది. అయితే వారు ఆసుపత్రికి వచ్చేలోపే వైద్యులు మౌనిక మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో అధిక కట్నం కోసం తమ బిడ్డను అత్తింటి వారే చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మౌనిక తల్లిదండ్రులు, బంధువులు గొడవకు దిగారు. భర్త శ్రీధర్‌, అత్త, బావలు కలిసి అదనపు కట్నం కోసం ఆమెను వేధించారని ఆరోపించారు. ఇంతకు ముందు కూడా శ్రీధర్ మౌనిక జీతం తన ఖాతాలోకి జమ చేయాల్సందిగా బలవంతం చేసేవాడని తెలిపారు. వరకట్న వేధింపుల కేసుల్లో స్టేషన్‌కు వచ్చిన మహిళలకు కౌన్సిలింగ్‌ ఇచ్చే మౌనిక ఇలా కట్నం వేధింపులకే బలౌతుందని అనుకోలేదని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. వీరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రీధర్‌, వరలక్ష్మి, క్రిష్ణమూర్తిలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story