కరోనా స్వల్ప లక్షణాలుంటే సీటీ స్కాన్‌ అవసరం లేదు : ఎయిమ్స్‌ డైరెక్టర్‌ గులేరియా

కరోనా స్వల్ప లక్షణాలుంటే సీటీ స్కాన్‌ అవసరం లేదు : ఎయిమ్స్‌ డైరెక్టర్‌ గులేరియా
కరోనా స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న వారికి సీటీ స్కాన్ అవసరం లేదని.. చీటికి మాటికీ సీటీ స్కాన్ చేయించుకుంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు.

ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న వారికి సీటీ స్కాన్ అవసరం లేదని.. చీటికి మాటికీ సీటీ స్కాన్ చేయించుకుంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. సీటీ స్కాన్ ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని.. అవి క్యాన్సర్‌కు దారితీసే అవకాశం ఉంటుందని అన్నారు. స్వల్ప లక్షణాలు కలిగిన బాధితులు పదే పదే సీటీ స్కానింగ్‌కి వెళ్లడం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉంటుందన్నారు. సీటీ స్కాన్, బయో మార్కర్స్‌ను చాలా వరకు దుర్వినియోగం చేస్తున్నారన్నారు. పైగా ఒక్క సీటీ స్కాన్ 300 ఛాతి ఎక్స్‌రేలతో సమానమని.. అది చాలా ప్రమాదకరమని పేర్కొన్నారు.

వ్యాధి తీవ్రతను పరీక్షించేందుకు, శరీరం చికిత్సకు స్పందిస్తుందా లేదా అని చూసేందుకు బయో మార్కర్స్‌ ఉపయోగిస్తారన్నారు గులేరియా. అయితే బయో మార్కర్స్ హానికరమని హెచ్చరించారు. అసింప్టమాటిక్‌ అయిన దాదాపు 30 - 40 శాతం కరోనా బాధితులు సీటీ స్కాన్ చేయించుకుంటున్నట్లు పలు అధ్యయనాల్లో వెల్లడైందని తెలిపారు. ఎవరికైనా కరోనా సోకిందేమోనన్న అనుమానం ఉంటే.. మొదట చెస్ట్ ఎక్స్‌రే తీసుకోవాలన్నారు. సీటీ స్కాన్ అవసరమైతే వైద్యుడే సలహా ఇస్తారని తెలిపారు.

కరోనా పాజిటివ్‌గా తేలినవారు రక్త పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదన్నారు గులేరియా. సీపీసీ లేదా ఎల్‌డీహెచ్ వంటి పరీక్షలు అనవసర భయాందోళన కలిగిస్తాయన్నారు. కరోనా లక్షణాలు లేనివారు హోం ఐసోలేషన్‌లో ఉండి కోలుకోవచ్చని తెలిపారు. వైద్యుల సూచనల మేరకు మాత్రమే బాధితులు మందులు వాడాలన్నారు. కరోనా ప్రారంభ దశలో అతిగా స్టెరాయిడ్స్ తీసుకుంటే అది ఊపిరితిత్తులపై దుష్ప్రభావం చూపించవచ్చని తెలిపారు. దానివల్ల న్యుమోనియా తీవ్రమయ్యే ప్రమాదం ఉందని.. కాబట్టి స్వల్ప లక్షణాలు ఉన్న బాధితులు సాధారణ మందులు వాడితే సరిపోతుందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story