CWC MEET: సార్వత్రికంపై సమాలోచనలు

CWC MEET: సార్వత్రికంపై సమాలోచనలు
రెండోరోజూ సీడబ్ల్యూసీలో విస్తృత చర్చ....సవాళ్లను అధిగమించాలని ఖర్గే దిశానిర్దేశం

హైదరాబాద్‌లో రెండోరోజు జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో రానున్న ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలు సహా వివిధ అంశాలపై విస్తృతంగా చర్చించారు. CWC సభ్యులు, శాశ్వత, ప్రత్యేక ఆహ్వానితులు, ఆయా రాష్ట్రాల ఇంఛార్జ్‌లు, అన్ని రాష్ట్రాల PCC అధ్యక్షులు, CLP నేతలు సమావేశంలో పాల్గొన్నారు. తమ ముందు చాలా సవాళ్లు ఉన్నాయని, అవి కేవలం కాంగ్రెస్ పార్టీకి చెందినవి మాత్రమే కాదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే అన్నారు. భారత ప్రజాస్వామ్యం, రాజ్యాంగానికి సంబంధించిన సవాళ్లని వివరించారు.


రెండు, మూడు నెలల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఆర్నెళ్లలో లోక్‌సభ ఎన్నికలతో పాటు జమ్మూకశ్మీర్ సమరానికి పార్టీ సన్నద్ధం కావాలని స్పష్టం చేశారు. ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వాలు సామాజిక న్యాయం, సంక్షేమంలో నూతన నమూనాతో విజయవంతం అయ్యాయని వాటిని దేశమంతటా ప్రచారం చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు నేతలను ఆదేశించారు. ఇది పరీక్షా సమయమన్న ఖర్గే పదేళ్ల భాజపా హయంలో సామాన్యులు ఎదుర్కొంటున్న సవాళ్లు పెరుగుతూ వచ్చాయని వివరించారు. అన్ని వర్గాల సమస్యలను ప్రధాని మోదీ పట్టించుకోవడం లేదని ఆక్షేపించారు. ఈ పరిస్థితుల్లో కలసికట్టుగా ఉండి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు.


వ్యక్తిగత ప్రయోజనాలు, విభేదాలను పక్కనపెట్టి పార్టీ విజయం కోసం నిరంతరం శ్రమించాలని కాంగ్రెస్ నేతలకు ఖర్గే దిశానిర్ధేశం చేశారు. సంస్థాగత ఐక్యత అత్యంత కీలకమన్న ఆయన కర్నాటకలో ఇది ఫలించిందని చెప్పుకొచ్చారు. ఆయా రాష్ట్రాల పరిస్థితులను నేతలు సమావేశంలో వివరించారు. తమ ప్రాంతాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అగ్రనేతలు తమ రాష్ట్రాల్లో పర్యటించాలని పలువురు నేతలు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరాం, ఛత్తీస్‌గడ్, రాజస్థాన్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కి విజయం కట్టబెడతారని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ధీమా వ్యక్తం చేసింది.

లోక్‌సభ ఎన్నికల సన్నద్ధత పైనా సమీక్షించిన వర్కింగ్ కమిటీ ఎన్నికల యుద్దానికి పూర్తిగా సిద్దంగా ఉన్నట్లు పేర్కొంది. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని సీడబ్ల్యూసీ విశ్వాసం వ్యక్తం చేసింది. శాంతి భద్రతలు, స్వేచ్చ, సామాజిక, ఆర్థిక న్యాయం, సమానత్వం తదితరాల విషయంలో ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తామని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రకటించింది. కర్నాటక తరహాలో నేతలంతా ఐక్యంగా పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని తెలంగాణ నేతలకు సీడబ్ల్యూసీ సూచించింది.

Tags

Read MoreRead Less
Next Story