Traffic e Challan: నకిలీ వెబ్‌సైట్‌తో పెండింగ్‌ చలాన్ల వసూళ్లు

Traffic e Challan: నకిలీ వెబ్‌సైట్‌తో పెండింగ్‌ చలాన్ల వసూళ్లు
ఈ-చలాన్ వెబ్ సైట్ డౌన్..

తెలంగాణ ప్రభుత్వం వాహనదారుల పెండింగ్ చలాన్లపై రాయితీ ప్రకటించిన విషయం తెలిసిందే.. గత నెల 26 నుంచి జనవరి 10 వరకు పెండింగ్‌ చలాన్ల చెల్లింపునకు అకాశం కల్పించింది. దీంతో వాహనదారుల నుంచి భారీ స్పందన వస్తున్నది. ఇప్పుడు దీనిని సైబర్‌ నేరగాళ్లు ఉపయోగించుకుంటున్నారు. నకిలీ వెబ్‌సైట్‌తో వాహనదారులను కేటుగాళ్లు మోసంచేస్తున్నారు. www.echallantspolice.in పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ను సృష్టించి చలాన్లు వసూలు చేస్తున్నారు. గుర్తించిన పోలీసులు వాహనదారులను అప్రమత్తం చేశారు.

నకిలీ వెబ్‌సైట్‌లో పేమెంట్స్‌ చేయవద్దని పోలీసులు హెచ్చరించారు. పేటీఎం, మీసేవా కేంద్రాల్లో పెండింగ్‌ చలాన్స్‌ క్లియర్‌ చేయాలని సూచించారు. అదేవిధంగా www.ehallan.tspolice.gov.in/publicview వెబ్‌సైట్‌లో చెల్లించాలని తెలిపారు. నకిలీ వెబ్‌సైట్‌ను ఎవరు సృష్టించారనే విషయమై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు ప్రకటించడంతో వాటిని చెల్లించడానికి చాలా మంది వినియోగదారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే వెహికల్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు దానికి సంబంధించిన వివరాలు రావడం లేదు. సాధారణంగా వాహన రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత పెండింగ్ చలాన్ల వివరాలను చూపించే వెబ్ సైట్ వినియోగదారులను పేమెంట్ గేట్ వేకు తీసుకెళ్తుంది. అయితే గత కొన్ని రోజులుగా సర్వర్ డౌన్ కావడంతో వినియోగదారులు చెల్లింపులు చేయలేకపోతున్నారు.

బైక్‌లు, ఆటోలకు 80 శాతం, ఫోర్‌ వీలర్లకు 60 శాతం, ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్లపై 90 శాతం, భారీ వాహనాలపై 50 శాతం రాయితీని ప్రకటించారు. రాష్ట్రంలో 2 కోట్లకు పైగా చలాన్లు పెండింగ్‌లో ఉండటంతో పోలీసుశాఖ ఈ నిర్ణయం తీసుకొన్నది. నిరుడు రాయితీ ప్రకటనతో 45 రోజుల్లోనే ఏకంగా 300 కోట్ల ఆదాయం సమకూరింది. కాగా.. చాలా మంది వినియోగదారులు నకిలీ వెబ్ సైట్లను ఆశ్రయించి మోసపోతున్నారు. పెండింగ్ చలాన్లు కట్టేందుకు వాహనదారులు వెబ్ సైట్ లో వెహికిల్ డిటెయిల్స్ ఎంటర్ చేసి డబ్బులు చెల్లించేస్తున్నారు. అయితే మళ్లీ చెక్ చేసుకుంటే మాత్రం అవే చలాన్లు కనిపిస్తున్నాయి. దీనిపై పోలీసులకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నకిలీ పోర్టల్స్ లో చెల్లింపులు చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని, నకిలీ పోర్టళ్లలో వ్యక్తిగత వివరాలను పంచుకోవద్దని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story