Dalit Bandh : మార్చి 7 నుంచి తెలంగాణలో దళితబంధు అమలు

Dalit Bandh :  మార్చి 7 నుంచి తెలంగాణలో దళితబంధు అమలు
Dalit Bandh : ఫిబ్రవరి 5లోగా లబ్ధిదారులను గుర్తించడంతో పాటు, వారికి బ్యాంకు ఖాతాలు తెరిపించాలని కలెక్టర్లను ఆదేశించారు.

Dalit Bandh : దళితబంధు పథకం ద్వారా లబ్ధిదారులకు 10 లక్షల రూపాయలను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని... ఇందులో నుంచి 10 వేలు లబ్ధిదారులకు రక్షణ నిధిగా ఉంటుందని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఫిబ్రవరి 5లోగా లబ్ధిదారులను గుర్తించడంతో పాటు, వారికి బ్యాంకు ఖాతాలు తెరిపించాలని కలెక్టర్లను ఆదేశించారు. లబ్ధిదారులు లాభసాటి యూనిట్లను ఎంపిక చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. దశలవారీగా దళితబంధు పథకం అమలవుతుందని సీఎస్ తెలిపారు.

దళితబంధుకు నిధులకు కొరత లేదని సీఎస్ స్పష్టం చేశారు. ఈ పథకం అమలుకు నిన్న 100 కోట్లు విడుదలయ్యాయని... మరో రెండు మూడు రోజుల్లో 1,200 కోట్లు విడుదల చేసి జిల్లా కలెక్టర్ల ఖాతాల్లో జమచేస్తామన్నారు సీఎస్‌. నియోజకవర్గాల్లోని గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రత్యేక అధికారులను నియమించాలని కలెక్టర్లను ఆదేశించారు. అనంతరం అన్ని జిల్లాల కలెక్టర్లతో దళిత బంధు పథకం అమలు, లబ్ధిదారుల ఎంపిక, బ్యాంకు ఖాతాలు తెరవడం, జాబితాలు సిద్ధం చేయడం, యూనిట్లను గ్రౌండింగ్‌ చేయడం, తదితర అంశాలపై సీఎస్‌ సమీక్షించారు.

2021 ఆగస్టు 16న హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని శాలపల్లి ఇందిరానగర్‌లో సీఎం కేసీఆర్‌ ప్రారంభించిన దళితబంధు పథకం ఫలాలను దళితులు అందుకుంటున్నారని ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌ తెలిపారు. కాగా, దళిత బంధు పథకం ఇప్పటికే సీఎం దత్తత గ్రామం వాసాలమర్రి, హుజూరాబాద్‌ నియోజకవర్గంలో అమల్లోకి వచ్చింది. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం, సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి మండలం, నాగర్‌కర్నూలు జిల్లాలోని చారగొండ మండలం, కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్‌ మండలాల్లో అమలుకు చర్యలు చేపట్టింది సర్కార్‌.

Tags

Read MoreRead Less
Next Story