అప్ప చెరువులో మరో వ్యక్తి మృతదేహం లభ్యం

అప్ప చెరువులో మరో వ్యక్తి మృతదేహం లభ్యం

హైదరాబాద్‌ శివారు శంషాబాద్‌ పరిధిలోని గగన్‌పహాడ్‌ వద్ద అప్ప చెరువులో మరో వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. మృతుడు కర్నాటకకు చెందిన లారీ డ్రైవర్‌ రమేష్‌గా గుర్తించారు. దీంతో అప్పచెరువు ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. కర్నాటక నుంచి అల్లం వెల్లుల్లి లోడ్‌తో హైదరాబాద్‌ వచ్చిన రమేష్.. గగన్‌పహాడ్‌ వద్ద ప్రవాహంలో ట్యాంకర్‌తో సహా కొట్టుకుపోయాడు. శుక్రవారం వరద ఉధృతి తగ్గడంతో.. ట్యాంకర్‌ కింద రమేష్‌ మృతదేహం లభించింది. గురువారం ఎయిర్‌పోర్ట్‌ ఉద్యోగి కొట్టుకుపోవడంతో డెడ్‌బాడీని బయటకు తీశారు. మరోవైపు.. ఘటనా స్థలంలో పోలీసులు మృతదేహాల కోసం సెర్చ్‌ ఆపరేషన్‌ వేగవంతం చేశారు. జిల్లా కలెక్టర్‌, సైబరాబాద్‌ కమిషనర్‌ ఘటనా స్థలాన్నిసందర్శించి.. పరిస్థితిని సమీక్షించారు.

మరోవైపు.. గగన్ పహాడ్ అప్ప చెరువుకు గండిపడి దాని దిగువన ఉంటున్న ఓ కుటుంబం గల్లంతైంది. వారిలో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో బాలుడి కోసం గాలించినాఫలితం లేకుండా పోవడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. భార్య ఇద్దరు కొడుకులను కోల్పోయిన సాజిత్ రోదన అరణ్య రోధనగానే మిగిలింది.

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన సాజిత్ దంపతులు తమ ముగ్గురు పిల్లలతో కలిసి గగన్ పహాడ్‌లో నివాసముండే అత్తారింటికి వచ్చారు. మంగళవారం సాయంత్రం వెళ్లాలనుకున్నారు. చీకటి పడటంతో తెల్లారి వెళ్లాలని భావించి రాత్రి అక్కడే పడుకున్నారు. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి అప్పచెరువు కట్టతెగి వరద నీరు ముంచెత్తింది. అందరు గాడనిద్రలో ఉండగా ఇంట్లోకి నీరురావడాన్ని గమనించిన సాజిత్ వెంటనే తన అత్తతోపాటు చిన్నకూతురును తీసుకొని సురక్షిత ప్రాంతానికి వెళ్లాడు. మిగిలిన వారినితీసుకొద్దామని ఇంటివద్దకు వెళ్లేసరికి వరద ఉధృతికి.. భార్య కరీమా బేగం, కొడుకులు అయాన్, సోహేల్, భావమరిది అమీర్ కొట్టుకు పోయారు. మర్నాడు భార్య కరీమా, చిన్నకొడుకు సాహెల్, బావరిది అమీర్ విగతజీవులుగా తేలారు. అయితే మరో కుమారుడు అయాన్ ఏమైంది అనేది ఇప్పటివరకు తెలియకపోవడంతో సాజిత్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు.

గగన్‌ పహాడ్‌ అప్ప చెరువు మృతుల కుటుంబాలను అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకుంటుందని.. చేవెళ్ల ఎంపీ రంజిత్‌ రెడ్డి భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు త్వరలోనే 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయంతో పాటు.. ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story