CBI: ఎమ్మెల్సీ కవిత కస్టడీ పొడిగింపు

CBI: ఎమ్మెల్సీ కవిత కస్టడీ పొడిగింపు
ఈనెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు...

ఢిల్లీ మద్యం కేసులో MLC కవితకు ఈనెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు వెలువరించింది. మూడు రోజుల కస్టడీ ముగియటంతో కవితను కోర్టులో హాజరుపరిచిన సీబీఐ. రిమాండ్ దరఖాస్తులో పలు కీలక విషయాలను వెల్లడించింది. మూడు రోజుల సీబీఐ కస్టడీలో కవిత విచారణకు సహకరించలేదని దర్యాప్తు సంస్థ పేర్కొంది. 11 పేజీలతో రిమాండ్ దరఖాస్తు దాఖలు చేసిన సీబీఐ.. శరత్ చంద్రారెడ్డి నుంచి తీసుకున్న 14 కోట్ల రూపాయల వ్యవహారంపై కవితను ప్రశ్నించామన్న కేంద్ర దర్యాప్తు సంస్థ... లేని భూమి ఉన్నట్టుగా చూపి అమ్మకానికి పాల్పడిన విషయంపై కవిత నుంచి ఎలాంటి సమాధానం లేదని తెలిపింది. ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించేలా కవిత సమాధానాలు చెప్పారన్న సీబీఐ... మాగుంట శ్రీనివాసులు రెడ్డి, గోరంట్ల బుచ్చిబాబు, శరత్ చంద్రారెడ్డి, విజయ్ నాయర్ లతో జరిగిన సమావేశాలపైనా ప్రశ్నలు ఆడిగామని వెల్లడించింది. అడిగిన ప్రశ్నలకు సూటిగా సరైన సమాధానాలు ఇవ్వకుండా కవిత తప్పుదోవ పట్టించేలా వ్యవహరించారని తేల్చిచెప్పింది. తనది సీబీఐ కస్టడీ కాదు భాజపా కస్టడీగా పేర్కొన్న కవిత... బయట భాజపా వాళ్లు మాట్లాడేదే..లోపల సీబీఐ వారు అడుగుతున్నారని వ్యాఖ్యానించారు. రెండేళ్లుగా అడిగిందే అడుగుతున్నారని అసహనం వ్యక్తం చేశారు.

కవిత... దర్యాప్తును, సాక్షులను ప్రభావితం చేయగలిగిన పలుకుబడి గల వ్యక్తి అని సీబీఐ పేర్కొంది. కేసుకు సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేయడం, చెరిపేసే అవకాశం ఉందని కేంద్రదర్యాప్తు సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. కేసుకు సంబంధించి డిజిటల్ పరికరాలు, డాక్యుమెంట్లను పరిశీలించాల్సి ఉందన్న సీబీఐ... ఈ పరిస్థితుల్లో ఆమెకు 14 రోజుల పాటు జ్యుడిషియల్‌ రిమాండ్ విధించాలని కోరింది. కోర్టు కవితకు 9 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించగా...ఆమెను తిహాడ్‌ జైలుకు తరలించారు.

మరోవైపు ఢిల్లీ మద్యం వ్యవహారంపై సీబీఐ కేసులో కవిత బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సీబీఐకి నోటీసులు ఇచ్చిన రౌస్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టు.. ఈనెల 20లోపు కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. కవిత బెయిల్‌ పిటిషన్‌పై..ఈనెల 22న ఉదయం 11గంటలకు విచారణ జరుపుతామని తెలిపింది. ఇదే సమయంలో.. కోర్టు ప్రాంగణంలో కవిత మీడియాతో మాట్లాడటంపై ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి.. ఆమె తరఫు న్యాయవాదిని ప్రశ్నించారు. ఆమె ఏం చెప్పాలనుకున్నా... విచారణ సమయంలో CBIకి చెప్పాలని, కోర్టు ఆవరణలో మాట్లాడటం సరికాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఇకపై అలా మాట్లాడవద్దని కవితకు చెప్పాలన్న న్యాయమూర్తి.. ఒకవేళ మాట్లాడాలనుకుంటే కోర్టు వెలుపల మాట్లాడాలని సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story