KTR: దక్షిణాదిలో సీట్లు తగ్గితే ప్రజా ఉద్యమమే

KTR: దక్షిణాదిలో సీట్లు తగ్గితే ప్రజా ఉద్యమమే
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై స్పందించిన కేటీఆర్‌.... తమ గొంతు నొక్కితే చూస్తూ ఊరుకోబోమని స్పష్టీకరణ

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య తగ్గితే బలమైన ప్రజా ఉద్యమం వస్తుందని తెలంగాణ పురపాలకశాఖా మంత్రి KTR అన్నారు. డీ లిమిటేషన్‌కు సంబంధించిన వార్తలపై ఆయన ఎక్స్‌(ట్విట్టర్‌)లో స్పందించారు. సీట్ల సంఖ్య తగ్గిస్తే అది బలమైన ప్రజాఉద్యమానికి నాంది పలుకుతుందని వ్యాఖ్యానించారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజలమంతా భారతీయులుగా, ఉత్తమ పనితీరు కనబర్చే రాష్ట్రాల వాసులుగా గర్వపడుతున్నామని KTR పేర్కొన్నారు. దేశంలోని అత్యున్నత ప్రజాస్వామ్య వేదికలో తమ ప్రాతినిధ్యాన్ని, తమ వాణిని అణచాలని చూస్తే మౌనంగా ఉండబోమని వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం అన్ని విషయాలను వింటుందని, న్యాయం గెలుస్తుందని ఆశిస్తున్నట్లు కేటీఆర్ వ్యాఖ్యానించారు . కేటీఆర్ ట్వీట్ పై స్పందించిన మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంతో దక్షిణాదికి ప్రమాదం పొంచి ఉందన్నారు.


మరోవైపు.. హైదరాబాద్‌ జంటనగరాల్లో మూసీ నదిపై దాదాపు తొమ్మిది, ఇంకొక ఐదు బ్రిడ్జిలు మొత్తం కలిపి 14 బ్రిడ్జిలకు KTR శంకుస్థాపన చేశారు. 545 కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ నిర్మాణాలతో నగరానికి కొంత అందాలు సంతరించుకుంటాయని KTR అన్నారు. హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తొమ్మిదిన్నర ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి కళ్లముందే కనిపిస్తుందని.. మళ్లీ ఎవ్వరు కావాలో ప్రజలే తేల్చుకోవాలని కేటీఆర్ తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గం ఫతుళ్ళగూడ నుంచి ఉప్పల్ పరిధి ఫీర్జాది గూడ వరకు నూతన బ్రిడ్జి నిర్మాణానికి... 52 కోట్ల రూపాయలతో 200 మీటర్ల పొడవైన వంతెనకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వాలు పట్టించుకోక మూసీ మురికి కూపంగా మారిపోయిందని కేటీఆర్ పేర్కొన్నారు. మూసీని పైనుంచి కింది వరకు మంచిరేవుల నుంచి కింద ఘట్ కేసర్ వరకు.. సుందరించాలన్న ముఖ్యమంత్రి కలను నెరవేరుస్తామన్నారు. కరోనా రావడం వల్ల సరైన సమయంలో చేయలేకపోయినా అద్భుతమైన బ్రిడ్జిలు కడతామని తెలిపారు. అనంతరం ముసారాంబాగ్ వద్ద 152కోట్ల రూపాయలతో నూతన బ్రిడ్జి నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. 2020లో వరదలు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు వచ్చాయన్న మంత్రి.. ఇప్పుడు అన్ని వంతెనలు పూర్తి చేస్తున్నామని తెలిపారు. గోదావరి జలాలతో గండిపేట చెరువును నింపుతామని కేటీఆర్ స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story