Medaram: నేడే మహాజాతర ప్రారంభం..జనసంద్రంగా మేడారం

Medaram: నేడే మహాజాతర ప్రారంభం..జనసంద్రంగా మేడారం
నేడు గద్దెపైకి రానున్న సారలమ్మ

ఇవాళ్టి నుంచి నాలుగు రోజులపాటు మేడారంలో అంగరంగ వైభవంగా సమ్మక్క సారలమ్మ జాతర జరగనుంది. ఈ సాయంత్రం గద్దెలపైకి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు చేరుకోనున్నారు. రేపు సమ్మక్క గద్దెలపైకి చేరుకుంటుంది. ఈనెల 23న రాష్ట్రపతి, సీఎం సహా ప్రముఖులు మహాజాతరకు రానున్నారు.

మాఘ మాసం పౌర్ణమి వెలుగుల్లో మేడారం మహా జాతర అట్టహాసంగా ప్రారంభమవుతోంది. రెండేళ్లకోసారి జరిగే జనజాతరపూర్తిగా ఆదివాస సంప్రదాయం ప్రకారం జరుగుతుంది. నాలుగు రోజుల పాటు కోలాహలంగా వనంలో జరిగే సంబురమిది. ఆదివాసీ జాతరలో తొలి రోజు పూజారులు వెంటరాగాడప్పు శబ్దాలు, డోలు వాద్యాల నడుమ సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి వేంచేయనున్నారు. ఇప్పటికే మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగుండ్ల నుంచి బయలుదేరిన పగిడిద్దరాజు మంగళవారం రాత్రి గోవిందరావుపేట మండలం లక్ష్మీపురంలో బస చేసి ఈ రాత్రికి గద్దెల వద్దకు చేరుకుంటారు. ఇదే సమయంలోకన్నెపల్లి నుంచి సారలమ్మ ఏటూరు నాగారం మండలం కొండాయ్ నుంచి గోవిందరాజులు డప్పు, డోలు వాద్యాల నడుమ గద్దెలపైకి విచ్చేస్తారు.

కన్నెపల్లి నుంచి జంపన్నను డప్పుడోలు వాద్యాలతో కోలాహలంగా జంపన్న వాగు సమీపంలోని గద్దెకు చేర్చారు. అనంతరం జంపన్నకు ప్రత్యేక పూజలు చేశారు. ఆదివాసి సంప్రదాయాలతో జంపన్నను కొలిచారు. జాతరను పురస్కరించుకుని మేడారం విద్యుద్దీప కాంతులతో శోభాయమానమైంది. మేడారం పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకూ క్షణం కూడా విరామం లేకుండా దర్శనాలు జరుగుతున్నాయి. పిల్లా పాపలను వెంటపెట్టుకుని.. అమ్మల దర్శనం కోసం భక్తజనం ఆతృతతో విచ్చేస్తున్నారు. మేడారం పరిసరాలు భక్తులతో రద్దీగా మారాయి. ఆర్టీసీ, ప్రైవేటు వాహనాల కిక్కిరిసిపోతున్నాయి. ఇక ములుగు జిల్లా పరిసర గ్రామస్థులు తమ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఎడ్ల బళ్ల పైన విచ్చేస్తున్నారు. నేటి నుంచి హెలికాఫ్టర్ సేవలూ అందుబాటులోకి వస్తున్నాయి.

సమ్మక్క-సారలమ్మ జాతరను ఘనంగా నిర్వహించుకోవాలని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ పిలుపునిచ్చారు. నస్పూర్‌లోని కలెక్టరేట్‌లో డీఈవో యాదయ్యతో కలిసి జాతర పోస్టర్‌ను విడుదల చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పారిశుధ్య నిర్వహణ, తాగునీరు, వైద్య శిబిరాలను తదితర వసతులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాగ్రీన్‌ కోర్‌ సమన్వయకర్త గుండేటి యోగేశ్వర్‌, అధికారులు పాల్గొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story