Top

తెలంగాణలో భూముల డిజిటల్‌ సర్వే.. హద్దుల పంచాయతీలు ఉండవు : కేసీఆర్‌

వాటికి ప్రజలు తికమక పడొద్దని... కలెక్టర్లు ఎప్పటికప్పుడు స్పందించి సంపూర్ణ వివరాలు అందించాలని కేసీఆర్‌ ఆదేశించారు.

తెలంగాణలో భూముల డిజిటల్‌ సర్వే.. హద్దుల పంచాయతీలు ఉండవు : కేసీఆర్‌
X

రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే డిజిటల్ సర్వే చేసి, వ్యవసాయ భూములకు కో ఆర్డినేట్స్ ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. రెనెన్యూ సంస్కరణలు, ధరణి పోర్టల్ పనితీరుపై ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించిన కేసీఆర్‌.. సర్వే కోసం వెంటనే టెండర్లు పిలవాలని ఆదేశించారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తి పారదర్శకంగా జరగాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఎంతో శ్రమించి, ప్రవేశ పెట్టి, అమలు చేస్తున్న ధరణి పోర్టల్ నూటికి నూరు పాళ్లు విజయవంతమైందని సిఎం సంతృప్తి వ్యక్తం చేశారు. సంస్కరణల ఫలితంగా, రెవెన్యూ శాఖ పని విధానంలో సమూల మార్పులు చోటు చేసుకున్నాయని, ఈ నేపథ్యంలో ఆ శాఖ అధికారులు భవిష్యత్తులో నిర్వహించాల్సిన విధులకు సంబంధించి జాబ్ చార్టు రూపొందించనున్నట్లు వెల్లడించారు.

ధరణి పోర్టల్ వల్ల రెవెన్యూలో అవినీతి అంతమైందని... నోరులేని, అమాయకుల రైతులకు న్యాయం జరిగిందని కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. ఒకరి భూమిని ఇంకొకరి పేరు మీద రాయడం.. జుట్టుకు జుట్టుకు ముడేసి పంచాయతీ పెట్టడం లాంటి దుష్ట సంప్రదాయాలు ఆగాయని అన్నారు. డాక్యుమెంట్లు గోల్‌మాల్‌ చేసి రెవెన్యూ రికార్డుల పేరిట జరిగే దుర్మార్గం పోయిందన్నారు. ఎలాంటి గందరగోళం, అస్తవ్యస్తం లేకుండా భూముల క్రయవిక్రయాల ప్రక్రియ సాగుతోందని తెలిపారు. ధరణిలో నమోదైన భూములను మాత్రమే అమ్మే, కొనే వీలున్నట్లు కేసీఆర్‌ చెప్పారు. ప్రభుత్వం అనుసరిస్తున్న పకడ్బందీ వ్యూహం వల్ల ఎవరూ ధరణిలో వేలు పెట్టి మార్పులు చేసే అవకాశం లేదన్నారు.. చివరకు సీసీఎల్‌ఏ, సీఎస్‌ కూడా రికార్డులను మార్చలేరన్నారు కేసీఆర్‌. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఇంత సజావుగా సాగడం కొంతమందికి మింగుడు పడడం లేదని.. చిలువలు, పలువలుగా అసంబద్ధమైన విషయాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పైరవీలు చేసి అక్రమంగా సంపాదించుకునే వారే అపోహలు సృష్టించి గందరగోళ పరిచే ప్రయత్నాలు చేస్తున్నారని... వాటికి ప్రజలు తికమక పడొద్దని... కలెక్టర్లు ఎప్పటికప్పుడు స్పందించి సంపూర్ణ వివరాలు అందించాలని కేసీఆర్‌ ఆదేశించారు.

ప్రభుత్వం జరిపిన సమగ్ర భూరికార్డుల ప్రక్షాళన, కొత్త పాసుపుస్తకాలు, ధరణి పోర్టల్ తదితర సంస్కరణ వల్ల వ్యవసాయ భూములకు సంబంధించిన చాలా సమస్యలు పరిష్కారమయ్యాయని సీఎం కేసీఆర్‌ చెప్పారు. మిగిలిన కొద్ది పాటి సమస్యలు కూడా ప్రభుత్వం త్వరలో జరిపే డిజిటల్ సర్వే వల్ల పరిష్కారం అవుతాయన్నారు. ఇప్పటికే డిజిటల్ సర్వే ప్రారంభం కావాల్సి ఉన్నా.. కరోనా వల్ల ఆగిందని చెప్పారు. అతి త్వరలోనే డిజిటల్ సర్వే ప్రారంభం అవుతుందన్నారు. రైతుల భూముల మధ్య, అటవీ- ప్రభుత్వ భూముల మధ్య, అటవీ-ప్రైవేటు భూముల మధ్య హద్దుల పంచాయతీ కూడా పరిష్కారం అవుతుందని చెప్పారు. 3-4 నెలల్లో మొత్తం సమస్యలు కొలిక్కి వస్తాయని సీఎం కేసీఆర్‌ చెప్పారు.

భూ రికార్డులు సక్రమంగా ఉన్న దేశాల్లో జీడీపీ 3-4 శాతం వృద్ధి సాధించిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా అలాంటి విప్లవాత్మక మార్పుకు ప్రభుత్వం సిద్ధపడిందని సీఎం స్పష్టం చేశారు. మారిన పరిస్థితుల్లో రెవెన్యూ స్వరూపం కూడా మారిందని.. రెవెన్యూ శాఖ విధులు, బాధ్యతల్లో మార్పులు వచ్చాయని అన్నారు.. ఇప్పుడు భూమి శిస్తు వసూలు చేయకపోగా, ప్రభుత్వమే రైతుబంధు ద్వారా ఎకరానికి ఏటా 10వేల సాయం అందిస్తోందని కేసీఆర్‌ గుర్తు చేశారు. రెవెన్యూ శాఖ విధుల్లో మార్పులు అనివార్యమన్నారు. రెవెన్యూ శాఖలో ఎవరేమి పని చేయాలనే విషయంలో ప్రభుత్వం త్వరలోనే జాబ్ చార్టు రూపొందిస్తుందని చెప్పారు. ఏమైనా సమస్యలు, సందేహాలుంటే రైతులు ఇకపై కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాలన్నారు సీఎం కేసీఆర్‌. కలెక్టర్లు ఆ దరఖాస్తులను స్వీకరించి, పరిశీలిస్తారన్నారు. సీఎస్‌ నుంచి వచ్చే మార్గదర్శకాలకు అనుగుణంగా వాటిని పరిష్కరించాలని సిఎం చెప్పారు.

Next Story

RELATED STORIES