ఇంటింటి ప్రచారంలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులు పోటీ

ఇంటింటి ప్రచారంలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులు పోటీ

దుబ్బాక ఉపఎన్నిక ప్రచారం వాడీవేడీగా సాగుతోంది. అధికార విపక్షాల మధ్య.. మాటల తూటాలు పేలుతున్నాయి. దుబ్బాక మండలం రామక్కపేట, చీకోడ్‌ గ్రామాల్లో మంత్రి హరీష్‌రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి సోలిపేట సుజాతతో కలిసి మంత్రి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అబద్దాలు, బోగస్‌ ప్రచారంలో బీజేపీకి నోబెల్‌ బహుమతి ఇవ్వాల్సిందే అని హరీష్‌రావు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మందు బస్తాలకు.. చెప్పులు లైన్‌లో పెట్టే పరిస్థితి ఉండేదని విమర్శించారు. కాలిపోయే మోటర్లు, పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లతో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌.. కరెంట్‌ ఇయ్యక చంపారు.. బీజేపీ మీటర్లు పెట్టి చంపుతారట అని రెండు పార్టీలపై మంత్రి హరీష్‌రావు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు.

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌ మండలం సూరంపల్లి గ్రామంలో కాంగ్రెస్‌ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు.. తన తండ్రి ముత్యంరెడ్డికి, తనకు టీఆర్‌ఎస్‌లో జరిగిన అన్యాయాన్ని వెళ్లగక్కారు. నమ్మించి మోసం చేయడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దిట్ట అన్నారు. తామేదో సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదని అన్నారు. ముత్యంరెడ్డి ఎప్పుడూ దుబ్బాక అభివృద్ధి కోసమే ఆలోచించారని గుర్తు చేశారు.

ఇక బీజేపీ కూడా ప్రచారాన్ని ముమ్మరం చేసింది.. తొగుట మండల కేంద్రంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు తరపున మాజీ మంత్రి బాబూ మోహన్‌ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌ అందరినీ వాడుకుని వదలేశారని.. అందులో మొదటి బాధితుడు రఘునందన్‌రావు అని అన్నారు. ఎవరు సమర్థులో ఆలోచించి ప్రజలు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. మొత్తంగా అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారంలో తారా స్థాయికి చేరింది.. ఇంటింటి ప్రచారంలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులు పోటీపడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story