తెలంగాణ

దుబ్బాక ఉపపోరుకు నేతల ప్రచారం జోరు

దుబ్బాక ఉపపోరుకు నేతల ప్రచారం జోరు
X

దుబ్బాకలో బైఎలక్షన్‌ ప్రచారం హోరెత్తుతోంది. ప్రచారంలో భాగంగా దుబ్బాక బస్‌డిపో నుంచి తెలంగాణ తల్లి చౌరస్తా వరకు టీఆర్‌ఎస్‌ భారీ ర్యాలీ నిర్వహించింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాతకు మద్దతుగా ప్రచారం నిర్వహించిన మంత్రి హరీశ్‌రావు.. విపక్షాలపై విమర్శలు గుప్పించారు. ఎన్నికలైపోతే కాంగ్రెస్, బీజేపీ వాళ్లు అడ్రస్ ఉండరని మండిపడ్డారు. బీజేపీ నేతలు ఓట్ల కోసం అసత్యప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 70 ఏళ్లు పాలించినా కనీసం తాగునీరు ఇవ్వలేని పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. ఇంటింటికీ తాగునీరు ఉత్తమ్‌ వల్ల వచ్చిందా..? బండి సంజయ్‌ వల్ల వచ్చిందా..? ప్రజలు ఆలోచించుకోవాలని సూచించారు.

కాంగ్రెస్‌ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌ రెడ్డి గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. చేగుంట మండలం పోతన్‌పల్లి, కాసన్‌పల్లి, చందాయ్‌పేటలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. చేగుంట మండలంలో తన తండ్రి చెరుకు ముత్యంరెడ్డి చేసిన అభివృద్ధి తప్ప.. గడచిన ఏడేళ్లలో చేగుంట మండలంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. దుబ్బాకకు వచ్చే నిధులన్నీ గజ్వేల్‌, సిద్దిపేటకు తరలించారని విమర్శించారు.

దుబ్బాకలో కాంగ్రెస్‌ అభ్యర్ధి చెరుకు శ్రీనివాస్‌రెడ్డిని గెలిపించాలంటూ ఆలేరు నియోజకవర్గం కాంగ్రెస్‌ ఇంఛార్జ్‌ బీర్ల అయిలయ్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మాజీమంత్రి చెరుకు ముత్యంరెడ్డి చేసిన అభివృద్ధి పనులను చూసి.. ఆయన కుమారుడు శ్రీనివాస్‌రెడ్డిని గెలిపించాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

రాయపోల్‌ మండలం బేగంపేటలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు మద్దతుగా ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు ప్రచారం నిర్వహించారు. దుబ్బాక ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. దుబ్బాక అభివృద్ధి చెందాలంటే.. రఘునందన్‌రావును గెలిపించాలని ప్రజలకు సూచించారు. ప్రశ్నించే గొంతును అసెంబ్లీకి పంపించాలని రఘునందన్‌రావు కోరారు.

దుబ్బాక ఉపఎన్నికల్లో గెలుపును ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ప్రధాన పార్టీలు.. గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నాయి. పార్టీల అభ్యర్థులకు మద్దతుగా ఇతర ప్రాంతాల నుంచి కూడా ముఖ్యనేతలు తరలివచ్చి.. ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఎన్నికల సందడితో దుబ్బాక నియోజకవర్గంలోని గ్రామాలు.. నేతలు, కార్యకర్తల ర్యాలీలలో కిటకిటలాడుతున్నాయి.

Next Story

RELATED STORIES