TS POLLS: తెలంగాణలో కలెక్టర్లు, ఎస్పీలు బదిలీ

TS POLLS: తెలంగాణలో కలెక్టర్లు, ఎస్పీలు బదిలీ
నలుగురు కలెక్టర్లు, ముగ్గురు కమిషనర్లు బదిలీ.. 13 మంది ఎస్పీలను బదిలీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

తెలంగాణలో పలువురు కలెక్టర్లు, ఎస్పీలపై బదిలీ వేటు వేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రంగారెడ్డి, మేడ్చల్‌, యాదాద్రి, నిర్మల్‌ జిల్లాల కలెక్టర్లు 13 మంది ఎస్పీలు, పోలీసు కమిషనర్లను బదిలీ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. నేడు సాయంత్రం 5 గంటల వరకు ప్యానల్ పంపాలని ఈసీ ఆదేశాల్లో పేర్కొంది. రంగారెడ్డి కలెక్టర్ హరీశ్‌, మేడ్చల్ కలెక్టర్ అమోయ్ కుమార్, యాదాద్రి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, నిర్మల్ కలెక్టర్ వరుణ్‌రెడ్డిలను బదిలీ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. 13 మంది ఎస్పీలు, పోలీసు కమిషనర్లను కూడా బదిలీచేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌, వరంగల్ పోలీస్‌ కమిషనర్‌ రంగనాథ్‌ నిజామాబాద్ పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణపై ఈసీ బదిలీ వేటు వేసింది.రవాణాశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, వాణిజ్యపన్నులశాఖ కమిషనర్ టీకే శ్రీదేవి ఎక్సైజ్ శాఖ సంచాలకుడు ముషారఫ్ అలీని కూడా బదిలీచేయాలని ఈసీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎక్సైజ్, వాణిజ్యపన్నుల శాఖకు ప్రత్యేక కార్యదర్శులను నియమించాలని ఆదేశించింది.

మొత్తం నలుగురు కలెక్టర్లు, ముగ్గురు కమిషనర్‌లు, 13 మంది ఎస్పీలపై బదిలీ వేటు పడింది. బదిలీ అయిన అధికారులు వెంటనే.. వారి జూనియర్‌లకు బాధ్యతలు అప్పగించాలని ఎన్నికల సంఘం సూచించింది. రాష్ట్రాల్లో పర్యటించిన సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన సమీక్షలో కొందరి అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎన్నికల వేళ అక్రమ మద్యం పారే అవకాశం ఉందన్న సమాచారం సహా వివిధ విషయాల్లో ఈసీ అసంతృప్తిగా ఉందని, అందుకే అధికాలపై బదిలీ వేటు వేసిందని ఆ వర్గాలు వివరించాయి.

తెలంగాణలో జరిగిన సమీక్షా సమావేశంలో నాన్ క్యాడర్ అధికారులు ముఖ్యమైన పదవుల్లో ఉన్నట్లు ఎన్నికల సంఘం గుర్తించింది. ప్రస్తుతం బదిలీ అయిన 13 మంది ఎస్పీల్లో.... తొమ్మిది మంది నాన్ క్యాడర్ పోలీసు అధికారులు ఉన్నట్లు..ఎన్నికల సంఘం వర్గాలు వెల్లడించాయి. పనితీరు, వచ్చిన సమాచారాన్ని పూర్తిగా అంచన వేసిన తర్వాతే...... బదిలీ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాల్లోనూ అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. మద్యం, నగదు, డ్రగ్స్, ఉచితాల పంపిణీని అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కమిషన్ తెలిపింది. నిష్పాక్షికమైన, పారదర్శకమైన ఎన్నికల నిర్వహణే... తమ మొదటి ప్రాధాన్యతని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story