TSPSC Paper Leak: నిందితులు ప్రవీణ్‌, రాజశేఖర్‌లను విచారించిన ఈడీ

TSPSC Paper Leak: నిందితులు ప్రవీణ్‌, రాజశేఖర్‌లను విచారించిన ఈడీ
చంచల్‌గూడ జైలులో జైలు అధికారి గదిలో వారిద్దరినీ విచారించారు ఈడీ అధికారులు

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసులో నిందితులు ప్రవీణ్‌, రాజశేఖర్‌లను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తొలి రోజు విచారించింది. చంచల్‌గూడ జైలులో జైలు అధికారి గదిలో వారిద్దరినీ విచారించారు ఈడీ అధికారులు . దాదాపు 6గంటలపాటు పలు ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. ప్రశ్నపత్రాలను విక్రయాలు జరిపి డబ్బులు ఎక్కడికి మళ్లించారనే కోణంలో దర్యాప్తు చేసినట్లు తెలుస్తోంది. ఇవాళ మరోసారి ఇద్దర్నీ ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఇప్పటికే పేపర్ లీక్ కేసును సిట్ దర్యాప్తు చేస్తుండగా .. ఇప్పుడు ఈడీ సైతం రంగంలోకి దిగింది. హైదరాబాద్‌ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ ఐఆర్‌ ఆధారంగా మనీ లాండరింగ్‌ ఆరోపణలపై TSPSC పేపర్ లీక్‌ నిందితులను విచారిస్తున్నారు ఈడీ అధికారులు. ఈ విచారణలో మరిన్ని కొత్త అంశాలు బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో కనీసం రూ.40 లక్షలు చేతులు మారి ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ భావిస్తోంది. దర్యాప్తు జరుగుతున్న కొద్దీ నిందితులు, లావాదేవీలు బయటపడుతున్నాయి. డివిజనల్‌ ఎకౌంట్స్‌ ఆఫీసర్‌(డీఏవో) ప్రశ్నపత్రం ఖమ్మంలో ఓ యువతికి అందినట్లు, ప్రతిఫలంగా 10 లక్షలకు బేరం కుదుర్చుకున్నట్లు లీకేజీపై కేసు నమోదు చేసిన నెల రోజుల తర్వాత తేలింది. ఇలాంటి ఉదంతాలు ఇంకా ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇలాంటి లావాదేవీలపైనే ఈడీ కూడా దృష్టి పెట్టింది. ఇప్పటికే కమిషన్‌లోని కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ ఇన్‌ఛార్జి శంకరలక్ష్మి, లీకేజీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ సత్యనారాయణలను ఈడీ అధికారులు తమ కార్యాలయానికి పిలిపించి వాంగ్మూలం నమోదు చేశారు. చంచల్‌గూడ జైలులో ఉన్న ప్రధాన నిందితులు ప్రవీణ్‌, రాజశేఖర్‌లను విచారించేందుకు న్యాయస్థానం ద్వారా అనుమతి తెచ్చుకున్నారు.

సోమవారం ఈడీ అధికారులు సుమీత్‌ గోయల్‌, దేవేందర్‌ కుమార్‌ సింగ్‌లు చంచల్‌గూడ జైలుకు చేరుకున్నారు. వారిద్దర్నీ సాయంత్రం 5 గంటల వరకూ విచారించారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎంత డబ్బు చేతులు మారిందనే అంశంపై ప్రవీణ్‌, రాజశేఖర్‌లను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కొన్ని ప్రశ్నపత్రాలను వీరిద్దరు స్వయంగా అమ్ముకోగా.. మరికొన్నింటిని వీరి వద్ద కొనుక్కున్నవారు విక్రయించారు. ఇలా పలువురి చేతులు మారాయి. కొంత డబ్బు నగదు రూపంలో ముట్టగా.. ఇంకొంత బ్యాంకు ఖాతాల్లో జమైంది. ప్రశ్నపత్రాలను ఎంతకు అమ్ముకున్నారు, ఎంత డబ్బు ముట్టింది, ఆ డబ్బును ఏం చేశారంటూ నిందితులను ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. కొద్దిసేపు వేర్వేరుగా, ఆ తర్వాత కలిపి విచారించినట్లు తెలుస్తోంది. ఇవాళ మరోమారు ప్రశ్నించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story