Editorial: "కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోవడానికి కారణమేంటి..?"

Editorial: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోవడానికి కారణమేంటి..?
సంచలనంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారం; హంగ్ తప్పదు, కాంగ్రెస్ అధికారంలోకి రాదంటూ జోస్యం; వివాదాస్పదం కావడంతో సాయంత్రానికల్లా యూటర్న్; పదేపదే పార్టీని డ్యామేజ్ చేసేలా కోమటిరెడ్డి మాటలు; ఇంతచేస్తున్నా కనీస చర్యలు లేకపోవడంపై శ్రేణుల ఆవేదన


కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. నిఖార్సయిన కాంగ్రెస్ లీడర్. పార్టీలో సీనియర్, ప్రలోభాలకు లొంగి పార్టీలు మారకుండా అమ్మలాంటి పార్టీని నమ్ముకున్న నాయకుడు. పదవి ఉన్నా లేకున్నా పార్టీకోసం శక్తివంచన లేకుండా శ్రమిస్తున్న సేవకుడు. ఈ మాటలన్నీ వేరెవరో చెప్పినవి కావు. స్వయంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. సందర్భం వచ్చిన ప్రతీసారి తన గురించి తానే చెప్పుకునే పలుకులు. ఆయన గురించి, ఆయన కమిట్ మెంట్ గురించి ఇపుడు ఇంతలా ఎందుకు వివరించాల్సి వచ్చింది అంటే. కొంతకాలంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరే ఇందుకు కారణం. కోమటిరెడ్డంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే కోమటిరెడ్డి అనే చెప్పుకునే ఈ నిఖార్సయిన వ్యక్తి చేష్టలు... పార్టీలో మెజారిటీ లీడర్లకు, సగటు కార్యకర్తలకు అస్సలు మింగుడు పడటం లేదట. తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే కోమటిరెడ్డి.. ఇప్పుడు కూడా తన మార్క్ కామెంట్స్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇపుడు కాంగ్రెస్ పార్టీతో పాటు రాష్ట్రంమొత్తాన్ని షేక్ చేస్తున్నాయి.

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాదు. సీనియర్లంతా కిందా మీదా పడ్డా 50 సీట్లకు మించి గెలవదు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదు. హంగ్ వచ్చి... బీఆర్ఎస్, కాంగ్రెస్ లు పొత్తు పెట్టుకుంటాయంటూ జోస్యం చెప్పారు కోమటిరెడ్డి. కాంగ్రెస్, బీఆర్ఎస్ ల పొత్తు ఎలా సాధ్యమో కూడా తన పరిశోధనలో బయటపెట్టారు. కాంగ్రెస్ బీజేపీతో, బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకోలేవు. కాబట్టి కేసీఆర్ కాంగ్రెస్ తో కలవక తప్పదని తనే ఓ అంచనాకు వచ్చారన్నమట. అంతటితో ఆగాడా... పార్టీని ఒక్కరే గెలిపించడమేంటి?. అలా ఎలా కుదురుద్ది?. నేను పార్టీకి స్టార్ క్యాంపెయినర్ ని.. నేనూ కూడా పాదయాత్ర చేస్తానంటూ చెప్పుకొచ్చారు.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో కల్లోలం రేపాయి. ఆయన వ్యాఖ్యలపై అటు లీడర్లు, ఇటు శ్రేణులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాయి. పార్టీలోనే ఉంటూ మన పార్టీనే గెలవదని ఎలా చెబుతాడు. ఇది కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బయడం కాదా. పార్టీని డ్యామేజ్ చేయడం కాదా అని ప్రశ్నిస్తున్నారట. ఇక మరో విషయం పొత్తులు... తెలంగాణలో పొత్తులపై ఎవరూ మాట్లాడొద్దు. కొందరు బీఆర్ఎస్ తో పొత్తు ఉంటుందని ప్రచారం చేస్తున్నారట. వేలకోట్లు ప్రజల సొమ్మును దోచుకున్న వ్యక్తితో మనకు పొత్తేంటి. బీఆర్ఎస్ తో పొత్తు ప్రసక్తే లేదంటూ రాహుల్ గాంధీ గతంలోనే వరంగల్ సభలో గట్టిగా చెప్పారు. అయినా ఎవరైనా పొత్తుల ప్రస్తావన తెస్తే... అతను ఎంత పెద్ద నాయకుడైనా సరే నిర్ధాక్షిణ్యంగా పార్టీ నుంచి గెంటేస్తామని చెప్పారు.

సాక్ష్యాత్తు పార్టీపెద్ద రాహుల్ గాంధీ చెప్పిన మాటకి కూడా కోమటిరెడ్డి విలువ ఇవ్వట్లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. సారు గారికి పీసీసీ చీఫ్ అంటే లెక్కలేదు, ఇన్ ఛార్జ్ అంటే లెక్క లేదు, అధిష్టానం అంటే లెక్కలేదు. కాంగ్రెస్ లో ఉంటూ పక్కపార్టీలో ఉన్న తమ్ముడిని గెలిపించమని ప్రచారం చేస్తాడు. మరి ఈయన నిఖార్సయిన కాంగ్రెస్ నాయకుడు ఎలా అవుతాడని ప్రశ్నిస్తున్నారట కార్యకర్తలు. గతంలోనే హైకమాండ్‌ యాక్షన్ తీసుకొని ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. లైన్ దాటాడని మర్రి శశిధర్ రెడ్డిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేసిన అధిష్టానం... పదేపదే పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడుతున్న కోమటిరెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సగటు కార్యకర్త అసహనం వ్యక్తం చేస్తున్నాడట. ఇప్పుడిప్పుడే పార్టీ గాడిలో పడుతోందన్న ప్రతీసారి.. కోమటిరెడ్డి తన చేష్టలతో కాంగ్రెస్ ను దెబ్బ తీస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.

ఇక తన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించడంతో ఎప్పటిలాగే ప్లేటు ఫిరాయించారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఉదయం మాట్లాడిన మాటలపై సాయంత్రానికల్లా యూటర్న్ తీసుకున్నారు. రాష్ట్రంలో హంగ్ వస్తుందని తాను అనలేదు. తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని చెప్పుకొచ్చారు. తానేం తప్పు మాట్లాడలేదన్న కోమటిరెడ్డి.. ఇందులో రాద్ధాంతం ఏం లేదని కొట్టి పారేశారు. ఇలా ప్లేటు ఫిరాయించడం, యూటర్న్ తీసుకోవడం కోమటిరెడ్డికి కొత్తేం కాదు. రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ ఇచ్చారన్న కోపంతో పదవిని కొనుక్కున్నాడంటూ అప్పట్లో నానా యాగీ చేశాడు. అధిష్టానం పీసీసీ పదవి అమ్ముకుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జన్మలో రేవంత్ ముఖం చూసేది లేదని.. గాంధీ భవన్ గడప తొక్కేది లేదని శపథం పూనారు. తీరా ఏమైందో అంతా చూశారు. రేవంత్ ను కలిశాడు, గాంధీ భవన్ కు వెళ్లాడు. మునుగోడు ఉపఎన్నిక టైంలోనూ బీజేపీ అభ్యర్థి, తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలని ప్రచారం చేశాడనే ప్రచారం ఉంది. ఓ ఆడియో కాల్ కూడా అప్పట్లో వైరల్ అయింది. అయితే ఆ ఆడియో తనది కాదని సింపుల్ గా కొట్టిపారేశాడు. ఇలా కోమటిరెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడటం, అవి వివాదాస్పదం కావడంతో నాలుక కరుచుకోవడం కామన్ అయిపోయందన్న టాక్ వినిపిస్తోంది.

రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయినప్పటి నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారం ఇలానే ఉంటోంది. రేవంత్ పార్టీ అధ్యక్షుడు అవడం ఈయనకు ఏమాత్రం ఇష్టం లేదు. దీంతో ప్రతీసారి తన వ్యాఖ్యలతో వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. పార్టీని బలహీన పరిచేలా చేస్తున్నారు. మునుగోడు ఉపఎన్నిక టైంలోనే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరుతారనే ప్రచారం జోరుగా జరిగింది. అయితే, మునుగోడులో సోదరుడు రాజగోపాల్ రెడ్డి ఓడిపోవడంతో వెనక్కి తగ్గారని టాక్. ఇందులో ఏ మేరకు వాస్తవం ఉందో తెలియదు. కానీ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ లోనే కొనసాగుతూ ఎప్పటికప్పుడు తన వ్యాఖ్యల ద్వారా కాంగ్రెస్ ను నష్టపరుస్తున్నారనే విమర్శలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story