Editorial: కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా కోమటిరెడ్డి

Editorial: కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా కోమటిరెడ్డి
"కోమటిరెడ్డిపై చర్యలు తీసుకోకపోవడానికి కారణం అదేనా..?"; ఏం చేసినా చెల్లుతుందనే ధోరణిలో ఎంపీ; ఇంత జరిగినా చర్యలెందుకు లేనట్లు? ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్న అధిష్టానం; కోమటిరెడ్డికో న్యాయం, మిగతా లీడర్లకో మరోలానా?


ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. టీ కాంగ్రెస్ లో ఎప్పుడు వార్తల్లోని లీడర్ గా ఉంటారు. ఆయన వ్యవహారం కాంగ్రెస్ ను ఎప్పటికప్పుడు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటుంది. పూటకో మాటతో .. పూటకో తీరుతో కన్ఫ్యూజ్ చేస్తుంటాడు. ముఖ్యంగా కోమటిరెడ్డి వ్యవహారం పార్టీ నేతలను ఇరుకున పెడుతూ ఉంటుంది. గతంలో మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా తాను సూచించిన అభ్యర్థిని పెడితే ప్రచారం చేస్తానని చెప్పి మాట తప్పారు. సరిగ్గా ఎన్నికల ముందు ఆస్ట్రేలియా వెళ్లి .. అక్కడ కలిసిన నేతలతో కాంగ్రెస్ గెలవదంటూ కామెంట్స్ చేశారు. మునుగోడు కాంగ్రెస్ కార్యకర్తకు ఫోన్ చేసి.. రాజగోపాల్ రెడ్డికి పని చేయాలంటూ చెప్పారు. ఆ ఆడియో సైతం బయటకు రావడంతో నేతలు తలలు పెట్టుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ అధిష్టానం నోటీసులు ఇచ్చినా కోమటిరెడ్డిపై ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

మునుగోడు ఇష్యూ పక్కన పెడితే.. ఇప్పుడు మళ్లీ పార్టీకి డ్యామేజ్ జరిగేలా కామెంట్స్ చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వచ్చే ఎన్నికల్లో ఎవరికి పూర్తి స్థాయిలో మెజార్టీ రాదని...హంగ్ వస్తే కేసీఆర్ తమతో కలుస్తారంటూ కామెంట్స్ చేశారు. ఇవి పార్టీకి భారీ డ్యామేజ్ చేశాయి. ఈ విషయంలో కూడా రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే పిలిచి మాట్లాడారు. కోమటిరెడ్డికి వార్నింగ్ ఇచ్చి .. ఈ సారి మళ్ళీ ఇలాంటి వాఖ్యలు పునరావృతం కకూడదని గట్టిగానే చెప్పారట. అయితే కోమటిరెడ్డి మాత్రం తాను పార్టీ లైన్ లోనే మాట్లాడానని వివరణ ఇచ్చానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకోదని చెప్పానన్నారు. అయితే సర్వేల ప్రకారం హంగ్ వచ్చే అవకాశం ఉందని మాత్రమే చెప్పానన్నారు.

కోమటిరెడ్డి విషయంలో ఇంత జరుగుతున్నా చర్యలు తీసుకోకపోవడాన్ని పార్టీ నేతలు తప్పు పడుతున్నారు. గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కామెంట్స్ చేశారని అద్దంకి దయాకర్ కు షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకున్నారు. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కామెంట్స్ చేశారని మాజీఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ కు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. కానీ పార్టీకి డ్యామేజ్ చేసేలా పదేపదే వ్యవహరిస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై చర్యలకు కాంగ్రెస్ అధిష్టానం వెనకాడుతుండటం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి కూడా ఇలాగే వ్యవహరించారు. చాలా సందర్భాల్లో పార్టీకి నష్టం కలిగేలా మాట్లాడినా... అప్పటి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇన్ ఛార్జ్ కుంతియాలపై లూజ్ టాక్ చేసినా .. ఇలాగే చూసి చూడనట్లు వదిలేశారు. చివరికి రాజగోపాల్ రెడ్డి పార్టీని వదిలి బీజేపీలోకి జంప్ అయ్యారు. అంతే కాదు తరువాత వచ్చిన మునుగోడు ఉపఎన్నికల్లో పార్టీకి తీవ్ర నష్టం వచ్చేలా చేశారు. పార్టీ క్యాడర్ ను అంతా తన వెంట తీసుకెల్లిపోయారు. ఆ తరువాత ఆయన గురించి ఎంత మాట్లాడినా .. కాంగ్రెస్ చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు అయ్యింది. ఇక ఇప్పుడు వెంకట్ రెడ్డి విషయంలో కూడా అదే జరుగుతోందనే ఆవేదన పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.

కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై చర్యలు తీసుకోకపోవడానికి ప్రధాన కారణం ఏంటి అనే చర్చ నేతల్లో తీవ్రంగా జరుగుతోంది. వెంకట్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడనే కారణంగానే ఆయనపై చర్యలకు అధిష్టానం వెనుకడుగు వేస్తుందనే చర్చ లేకపోలేదు. కోమటిరెడ్డి పై యాక్షన్ కు ఇదే అడ్డా, లేక మరేదైనా కారణం ఉందా చూడాలి. కానీ కాంగ్రెస్ శ్రేణులు మాత్రం కోమటిరెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహంగా, అసహనంగా ఉందనేది మాత్రం కఠోర వాస్తవం.

Tags

Read MoreRead Less
Next Story