Editorial: "కేసీఆర్ పుట్టినరోజు సాక్షిగా బయటపడ్డ విభేదాలు"

Editorial: కేసీఆర్ పుట్టినరోజు సాక్షిగా బయటపడ్డ విభేదాలు
పార్టీ ఒక్కటే.. బర్త్ డే పార్టీలే వేరు..; కేసీఆర్ పుట్టినరోజు సాక్షిగా బయటపడ్డ విభేదాలు; ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వేరువేరుగా వేడుకలు; బాస్ దృష్టిలో పడేందుకు పోటాపోటీ కార్యక్రమాలు; నేతల తీరుతో అయోమయంలో పార్టీ శ్రేణులు

ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే సగానికి పైగా అసెంబ్లీ సెగ్మెంట్లలో అధికారపార్టీ ఆధిపత్యపోరు అగ్గి రాజేస్తోంది. అవకాశం వచ్చిన ప్రతీసారి తమ బలాన్ని ప్రదర్శించేందుకు కాలు దువ్వుతున్నారు. ముఖ్యంగా నల్లగొండ, నకిరేకల్, మిర్యాలగూడ, కోదాడ, మునుగోడు, నాగార్జునసాగర్ సెగ్మెంట్లలో వర్గపోరు తీవ్రంగా ఉంది. ఏడాదికాలంగా అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్న లీడర్లు... అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు. తాజాగా సీఎం కేసీఆర్ పుట్టినరోజు సాక్షిగా బీఆర్ఎస్ నేతల వర్గపోరు మరోసారి బట్టబయలైంది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వేడుకలు నిర్వహించడం తీవ్ర చర్చనీయాంశమైంది.

నల్లగొండలోని పానగల్ ఛాయా సోమేశ్వర ఆలయంలో.. CM KCR నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని.. మృత్యుంజయ హోమం చేపట్టారు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి. రక్తదాన శిబిరానికి మంత్రి జగదీష్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇక.. ఇదే నల్లగొండ టౌన్ లో బీఆరేస్ రాష్ట్ర కార్యదర్శి చాడా కిషన్ రెడ్డి సైతం.. తన నివాసంలో అనుచరులతో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. నల్లగొండ పట్టణ BRS పార్టీ అధ్యక్షుడు, కౌన్సిలర్ పిల్లి రామరాజు యాదవ్ తన అనుచర వర్గంతో బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నారు. పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. మరో సీనియర్ లీడర్ చకిలం అనిల్ కుమార్ సైతం ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను సపరేట్ గా నిర్వహించారు. ఈ రకంగా ఒక్క నల్లగొండ నియోజకవర్గంలోనే ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి, చకిలం అనిల్ కుమార్, టౌన్ ప్రెసిడెంట్ పిల్లి రామరాజు యాదవ్... ఎవరికి వారు సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు.

ఇక నకిరేకల్ లోనూ సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.. కేసీఆర్ జన్మదిన వేడుకలు జరిపారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ ఛైర్మన్ బండా నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. మరోవైపు నకిరేకల్ సెంటర్ లో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కేసీఆర్ బర్త్ డే వేడుకలు నిర్వహించారు. ఎన్నికల నాటి నుంచి చిరుమర్తి, వేముల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులున్నాయన్నది ఓపెన్ సీక్రెట్.

నాగార్జునసాగర్ లోనూ ఎమ్మెల్యే నోముల భగత్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి వర్గాలు వేరువేరుగా సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించాయి. కొంతకాలంగా ఇరువురి మధ్య వార్ నడుస్తోంది. కోదాడ నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ క్యాంప్ ఆఫీస్ లో బర్త్ డే వేడుకలు చేపట్టగా.. పట్టణంలో సీనియర్ నాయకులు వేనేపల్లి చందర్రావు, శశిధర్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ అంతా కలిసి సంబురాలు నిర్వహించారు.

మిర్యాలగూడ అసెంబ్లీ సెగ్మెంట్ లో ఎమ్మెల్యే భాస్కర్ రావు చేపట్టిన వేడుకలు రచ్చరచ్చ అయ్యాయి. కొందరు లీడర్లు, కార్యకర్తలు అసమ్మతి గలం వినిపించారు. ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడలతో వెళ్తున్నారని.. మాట వినని వారిని బెదిరింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీలకు కేటాయించిన మిర్యాలగూడ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పోస్టును ఏడాదిన్నరగా నింపకుండా తాత్సారం చేస్తున్నారని ఆందోళన చేపట్టారు.

అటు మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్ లోనూ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. ఇతర నియోజకవర్గ నేతలు ఎవరికి వారు సీఎం కేసీఆర్ బర్త్ డే వేడుకలు నిర్వహించారు. ఈ రకంగా.. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో నల్లగొండ, నకిరేకల్, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, మునుగోడు, కోదాడ, దేవరకొండ అసెంబ్లీ సెగ్మెంట్లలో సీఎం పుట్టినరోజు సాక్షిగా వర్గ విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. గులాబీ బాస్ దృష్టిలో పడేందుకు వేర్వేరుగా, పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించారు. నేతల తీరుతో అయోమయానికి గురికావడం శ్రేణుల వంతైందట.

Tags

Read MoreRead Less
Next Story