Editorial: "వివాదాలనే నమ్ముకున్న వైఎస్ షర్మిల..?"

Editorial: వివాదాలనే నమ్ముకున్న వైఎస్ షర్మిల..?
వివాదాలమయంగా షర్మిల పాదయాత్ర; జనానికి ఎక్కని రాజన్న రాజ్యం స్పీచులు; వివాదాలతోనే వార్తల్లో ఉండేలా ప్లాన్లు; బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే టార్గెట్ గా విమర్శలు; పాలేరు మినహా మరో నియోజకవర్గంపై పెట్టని దృష్టి; షర్మిలకు అధికారం ఎలా సాధ్యమనే ప్రశ్నలు?



వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిళ చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర దాదాపు నాలుగు వేల కిలోమీటర్లకు చేరువలో ఉంది. తెలంగాణలో అన్ని ఉమ్మడి జిల్లాలను చుట్టేస్తూ పాదయాత్ర సాగిస్తున్నారు. తెలంగాణలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సక్షేమ పాలన తీసుకొస్తాను అంటూ .. ఆమె ప్రారంభించిన పాదయాత్రకు జనం నుంచి పెద్ద రెస్పాన్స్ ఏం లేదు. ప్రారంభం నుంచి సగం రోజుల వరకు షర్మిళ తన పాదయాత్రలో సర్కార్ వైఫల్యాలు .. చెబుతూ .. తాము అధికారంలోకి వచ్చి రాజన్న రాజ్యం తీసుకొచ్చి సక్షేమం అందిస్తామంటూ చెప్పుకొచ్చారు.

అయితే షర్మిల చెప్పే మాటలకు ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ కనపడలేదు. ఆమె పాదయాత్రకు జనం కూడా పెద్దగా రాలేదు. ఇక మీడియాలో కూడా పెద్దగా ప్రాధాన్యత దొరకలేదు. దీంతో షర్మిల పునరాలోచనలో పడ్డారు. మధ్యలో కొద్దిరోజుల విరామం తర్వాత తిరిగి పాదయాత్ర ప్రారంభించిన సమయంలో ఆమె తన స్టైల్ మార్చారు. తాను వెళ్లే నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేలను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. దీంతో వివాదం మొదలైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నుంచి ప్రతిఘటన ప్రారంభమైంది.

చాలా రోజులు షర్మిల పాదయాత్రను లైట్ తీసుకున్న అధికార పార్టీ నేతలు ఇక తమను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ మాట్లాడుతుండడంతో అదే స్థాయిలో కౌంటర్ స్టార్ట్ చేశారు. వనపర్తి నియోజకవర్గంలో మంత్రి నిరంజన్ రెడ్డిపై షర్మిల విమర్శలు చేయడం దానికి కౌంటర్ గా ఆయన మంగళవారం మరదలు అనడం పెద్ద వివాదానికి దారి తీసింది. మంత్రిని చెప్పుతో కొడతా అంటూ షర్మిల చేసిన కామెంట్స్ దుమారాన్ని రేపాయి. ఇక అక్కడి నుంచి ప్రారంభమైన పరంపర అన్ని నియోజకవర్గాల్లోనూ కొనసాగింది.

కొందరు ఎమ్మెల్యేలు మామూలుగా ప్రెస్ మీట్ లు పెట్టి విమర్శలు చేసి వదిలేశారు. మరికొందరు మాత్రం తీవ్ర ప్రతిఘటన చూయిస్తూ వస్తున్నారు. నర్సంపేట నియోజకవర్గంలో పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డిపై నీవు మగాడివా అంటూ షర్మిల చేసిన హాట్ కామెంట్స్... ఆయన ఇచ్చిన కౌంటర్లు ఇరువర్గాల మధ్య పెద్ద ఘర్షణకు దారితీశాయి. షర్మిల క్యాంపుపై పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి అనుచరులు దాడి చేయడంతో వివాదం ముదిరింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి, షర్మిల పాదయాత్ర అనుమతి రద్దుచేసి ఆమెను అరెస్టు చేసి హైదరాబాద్ తరలించారు. షర్మిల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుందని ఆమె పాదయాత్రకు అనుమతి ఇవ్వమని స్థానిక పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో షర్మిల హైకోర్టుకు వెళ్లి పాదయాత్రకు అనుమతి తీసుకొచ్చుకున్నారు.

తిరిగి ప్రారంభమైన పాదయాత్రలో కూడా షర్మిల అదే వరవడిని కొనసాగించారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ విషయంలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. అక్కడ కూడా శంకర్ నాయక్ ను టార్గెట్ చేస్తూ షర్మిల చేసిన విమర్శలకు ఆయన వర్గం నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. శాంతి భద్రతల సమస్య తలెత్తే పరిస్థితి ఉందని పోలీసులు షర్మిల పాదయాత్రను మరోసారి అడ్డుకొని హైదరాబాద్ తరలించారు. ఆమె మాత్రం తన పంతాను మార్చుకునే పరిస్థితి కనిపించడం లేదు.

షర్మిలకు తన పాదయాత్రలో పెద్దగా రెస్పాన్స్ రాకపోవడంతో ఇలా స్థానిక ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ వార్తల్లో నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. రాజన్న సంక్షేమం అంటూ షర్మిల చెబుతున్న మాటలు జనానికి పెద్దగా ఎక్కడం లేదు. ఎందుకంటే వైఎస్ హయాంలో జరిగిన దానికి మించి కేసీఆర్ హయాంలో సంక్షేమం ఇప్పుడు అమలు చేస్తున్నారు. ఉదాహరణకు ఆనాడు వృధ్యాప్య పెన్షన్ రెండు వందలు ఇస్తే ఇప్పుడు రెండు వేలు ఇస్తున్నారు. కాబట్టి షర్మిల చెప్పే మాటలకు ప్రజల్లో పెద్దగా ప్రాధాన్యత దొరకడంలేదు. అందుకే ఆమె వివాదాలను నమ్ముకొని పాదయాత్రకు వెళుతున్నారు.

ఇప్పటి వరకు తాను పోటీ చేయాలనుకుంటున్న పాలేరు మినహా మరో నియోజకవర్గంపై కనీసం దృష్టి పెట్టలేదు షర్మిల. అలాంటప్పుడు ఆమె అధికారంలోకి ఎలా వస్తారు. ఆమె చెబుతున్న రాజన్న సంక్షేమం ఎలా తెస్తారు అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో ఉన్నాయి. దీనికి ఆమె నుంచి ఎలాంటి సమాధానం లేదు. కేవలం వివాదాలతో వార్తల్లో నిలిచి.. ప్రజల్లో ఫోకస్ కావాలని చూస్తున్న షర్మిలకు ఎన్నికల్లో గెలుపు ఎలా సాధ్యం అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

Tags

Read MoreRead Less
Next Story