Editorial: హస్తంలో సీట్ ఫైట్

Editorial: హస్తంలో సీట్ ఫైట్
తుంగతుర్తి కాంగ్రెస్ లో టికెట్ల లొల్లి? నాయకత్వ లేమితో సతమతమవుతున్న కాంగ్రెస్; కోమటిరెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డితో అద్దంకికి వైరం; లీడర్లు లేక చే జారిపోతున్న క్యాడర్; స్థానికులకే అవకాశం ఇవ్వాలంటున్న పార్టీ శ్రేణులు

ఆ ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ సెగ్మెంట్లో.. హస్తం పార్టీ దుస్థితికి కారణమేంటి? బలమైన క్యాడర్ ఉన్నా నాయకులు పట్టించుకోవడంలేదా? సీనియర్ నేతలు నియోజకవర్గంపై పట్టు కోల్పోయారా? ఓవైపు సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్న సీనియర్ నేత.. మరోవైపు గతంలో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి.. మధ్యలో అధికార ప్రతినిధిగా కొనసాగుతున్న ఇంకో నాయకుడు. ఇలా ముగ్గురు నేతలూ ఎవరి దారి వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారా? ఇంతకీ ఆ ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ సెగ్మెంట్ హస్తం పార్టీలో ఏం జరుగుతుంది..?

సూర్యాపేట జిల్లా పరిధిలోని తుంగతుర్తి నియోజకవర్గం అంటేనే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కేరాఫ్ అడ్రస్ గా ఉండేది. ఈ ప్రాంతం నుంచి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి.. వరసగా నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతో.. తుంగతుర్తి నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ డ్ స్థానంగా కేటాయించబడింది. దీంతో.. అప్పటివరకు ఇక్కడినుంచే ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన రాంరెడ్డి దామోదర్ రెడ్డి.. ఆతర్వాత సూర్యాపేటకు వలస వెళ్లిపోయారు. అయినప్పటికీ.. తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ లో రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఏం చెబితే అది వేదం మాదిరిగా నడుస్తూ వచ్చేది. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇక్కడ బీఆర్ఎస్ పట్టు చిక్కించుకుంది. తుంగతుర్తి నియోజకవర్గంలో బలమైన కాంగ్రెస్ క్యాడర్ ఉన్నప్పటికీ .. ఆ స్థాయిలో నాయకత్వం లేకపోవడం మైనస్ గా మారిందనే టాక్ వినిపిస్తోంది. గతంలో రెండు సార్లు పోటీ చేసిన అద్దంకి దయాకర్ కు.. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లకు మధ్య.. విభేదాలతో కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న తుంగతుర్తి నియోజకవర్గం.. ప్రస్తుతం క్యాడర్ ను కాపాడుకోలేని స్థితిలో ఉందనే వాదన వినిపిస్తోంది.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత.. 2014, 2018 లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన అద్దంకి దయాకర్ కి పరాజయం తప్పలేదు. వరుసగా రెండుసార్లు ఓటమి పాలవడంతో.. ఈసారి కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలని డిమాండ్ తెరపైకి తెస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసిన.. మరోసారి తనకు టిక్కెట్ ఖాయమని అద్దంకి దయాకర్ వర్గం ధీమాతో ఉండగా.. రాంరెడ్డి దామోదర్ రెడ్డి అనుచరుడిగా ఉన్న డాక్టర్ వడ్డేపల్లి రవి, నాగంగారి ప్రీతం సహా పలువురు నేతలు ఈసారి టికెట్ రేసులో ఉండటంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇటీవల అద్దంకి దయాకర్ వర్గం తిరుమలగిరి లో కాంగ్రెస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేసే ప్రయత్నం చేయగా.. దామోదర్ రెడ్డి వర్గం, ఎంపీ కోమటిరెడ్డి వర్గం అడ్డుకున్నాయి. దీంతో.. చేసేది లేక దయాకర్ నియోజకవర్గంలో అడుగు పెట్టకుండానే వెనుతిరిగారు. తాజాగా.. అకాల వర్షం, వడగండ్ల వానతో తుంగతుర్తి నియోజకవర్గంలో నష్టపోయిన రైతులను పరామర్శించడానికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి లను ఒకే వేదిక మీదికి తీసుకొచ్చి ధర్నాను విజయం వంతం చేశారు డాక్టర్ వడ్డేపల్లి రవి. దీంతో.. ఇద్దరు సీనియర్లు వడ్డేపల్లి రవి కి సపోర్టు చేస్తున్నారని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. కంటి డాక్టర్ గా నియోజకవర్గంలో పెద్దఎత్తున ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించడం.. వ్యక్తిగతంగా మంచి ఇమేజ్ ఉండటం తనకు ప్లస్ పాయింట్లుగా డాక్టర్ వడ్డేపల్లి రవి చెబుతున్నారు.

2014, 2018 లలో అద్దంకి దయాకర్ గెలుపు ముంగిట వరకు వెళ్లి.. బొక్క బోర్లా పడ్డారు. దీనికి.. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి తో ఆయనకున్న వైరమే కారణం అని టాక్ వినిపిస్తోంది. అదీగాక.. దామోదర్ రెడ్డి మీద ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడం ..కాంగ్రెస్ హై కమాండ్ కు పలుమార్లు ఫిర్యాదు చేశారు టీపీసీసీ tpcc అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్. మరోవైపు.. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తోనూ దయాకర్ కు రాజకీయ వైరం కొనసాగుతోంది. మునుగోడు ఉప ఎన్నికలు, ఆ తర్వాత పలుమార్లు MP కోమటిరెడ్డి మీద ఘాటైన వ్యాఖ్యలు చేయడం అప్పట్లో సంచలనంగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో స్థానికంగా ఉండే వారికి అవకాశం ఇస్తే.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశం ఉందని.. లేదంటే ఓటమి తప్పదని క్యాడర్ లో చర్చ జరుగుతోంది. AICC మెంబర్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లను కాదని.. అద్దంకి టికెట్ తెచ్చుకున్నా ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదని నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story