Editorial: ఎవరికి వారే యమునా తీరే... కాంగ్రెస్ బేజారే...!

Editorial: ఎవరికి వారే యమునా తీరే... కాంగ్రెస్ బేజారే...!
టికెట్టు రేసులో నేతల కుమ్ములాటలు; ఎవరికి వారే అన్న చందాన్న ప్రవర్తిస్తోన్న నాయకులు; నాయకుల తీరుతో ఆయోమయంలో కార్యకర్తలు

అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీలలో టికెట్ రేసు మొదలయిందని టాక్ వినిపిస్తోంది. చివరి నిమిషం దాకా టికెట్ కోసం వేచి ఉండకుండా ముందే కన్ఫమ్ చేయించుకుని ప్రచారంలో దూకేందుకు నేతలు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నల్లగొండ జిల్లాలో.. గతేడాది జరిగిన మునుగోడు ఉపఎన్నిక తర్వాత.. తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారిపోయాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 2018 ఎన్నికల్లో హస్తం గుర్తుపై గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. 2022 లో కాంగ్రెస్ పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. బీజేపీలో చేరడం అనంతరం జరిగిన బైపోల్ లో బీఆర్ఎస్ కి చెందిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పై ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ కోసం.. పాల్వాయి స్రవంతి, చలమల్ల కృష్ణారెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేయగా ..అధిష్టానం, రాష్ట్ర నాయకత్వం సూచనలతో.. స్రవంతి కి టికెట్ కేటాయించింది కాంగ్రెస్ పార్టీ. కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న BJP, BRS లను తట్టుకొని.. ఆమెకు 23వేల 906 ఓట్లు పోలయ్యాయి. దీంతో లీడర్లు పార్టీని వీడినా క్యాడర్ అలానే ఉందని అప్పట్లో టాక్ వినిపించింది.

వాస్తవానికి మునుగోడు బైపోల్ లో కాంగ్రెస్ పార్టీ తరపున టికెట్ రేసులో పాల్వాయి స్రవంతి, చలమల్ల కృష్ణారెడ్డి సహా పున్న కైలాష్ నేత ఉండగా.. సీనియర్ నేతలు ఉత్తమ్, కోమటిరెడ్డి, జానారెడ్డి వంటి నేతల సపోర్ట్ తో చివరి నిమిషంలో స్రవంతి నే టికెట్ వరించింది. రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడినప్పటినుంచి.. చలమల్ల కృష్ణారెడ్డి మునుగోడు సెగ్మెంట్ లో.. సుడిగాలి పర్యటన చేయడంతోపాటు.. చండూర్ లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వంతో సమావేశం పెట్టించి.. పార్టీ శ్రేణులకు భరోసా నింపే ప్రయత్నం చేశారట. రేవంత్ రెడ్డి కోటరీలో ఉన్న చల్లమల కృష్ణారెడ్డి మాత్రం.. తనకు బాధ్యతలు అప్పగించిన సంస్థాన్ నారాయణపురం మండలంలో పెద్దఎత్తున రేవంత్ రెడ్డి సభలు, రోడ్ షో లు, మీటింగ్ లను పెట్టించి.. గ్రాండ్ సక్సెస్ చేశారట. అయితే.. ఉపఎన్నిక సందర్భంగా గాంధీ భవన్ లో జరిగిన మీటంగ్ లో.. బైపోల్ టికెట్ స్రవంతి కి ఇస్తే.. 2023 చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణారెడ్డి కి మునుగోడు టికెట్ ఇచ్చేలా ఒప్పందం జరిగిందట.

సీన్ కట్ చేస్తే.. మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతల తీరు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా తయారయ్యిందట. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. నాయకుల తీరుతో కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారట. కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన పిలుపుమేరకు జరుగుతున్న నిరసన, ఆందోళన కార్యక్రమాలను కాంగ్రెస్ నేత పాల్వాయి స్రవంతి, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ చలమల్ల కృష్ణారెడ్డి వేర్వేరుగా నిర్వహిస్తుండటంతో.. క్యాడర్ ఎటువైపు వెళ్లాలో తెలియక అయోమయానికి గురవుతున్నారట. ఎన్నికల బరిలోకి దిగిన రెండు సార్లు పాల్వాయి స్రవంతి ఓటమిపాలు కావడంతో.. ముచ్చటగా మూడోసారి అవకాశం కోసం ఎదురుచూస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు చలమల్ల కృష్ణారెడ్డి రంగం సిద్ధం చేసుకుంటుండడంతో.. పాల్వాయి స్రవంతి వర్గం అప్రమత్తమయిందట. అయితే మునుగోడు బైపోల్ సమయంలో.. టీ-కాంగ్రెస్ పెద్దల సమక్షంలో జరిగిన ఒప్పందాన్ని.. చలమల్ల వర్గం ప్రస్తావిస్తోందట. టీపీసీసీ చీఫ్ రేవంత్ సహా.. కాంగ్రెస్ సీనియర్లు జానారెడ్డి, కోమటిరెడ్డి, దామోదర్ రెడ్డి వంటివారు సైతం చలమల్ల కృష్ణారెడ్డి వైపు ఉన్నట్లు ప్రచారం జరుగుతోందట.

రాబోయే అసెంబ్లీ ఎన్నికలు టార్గెట్ గా.. మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో తమవారిని మండలాధ్యక్షులుగా నియమించుకున్నారట కాంగ్రెస్ నేత చలమల కృష్ణారెడ్డి. క్షేత్రస్థాయిలో గ్రామ, మండలాల వారీగా సర్వేచేసి.. గ్రౌండ్ లెవల్ రియాలిటీ ప్రకారం.. నిఖార్సయిన నాయకులకే మండల అధ్యక్ష పదవులను కట్టబెట్టారట కృష్ణారెడ్డి. తాజాగా పీసీసీ జనరల్ సెక్రెటరీ పదవితో మరింత దూకుడు పెంచిన చలమల్ల కృష్ణారెడ్డి.. మండల స్థాయి పదవుల్లోనూ తన మార్క్ చూపించి కార్యకర్తల్లో కన్ఫ్యూజన్ కు తెరదించాలనే ప్రచారం జరుగుతోందట. అయితే..అసెంబ్లీ ఎన్నికల నాటికి టికెట్ ఎవరికిస్తారోనని కార్యకర్తల్లో జోరుగా చర్చ జరుగుతోందట.

Tags

Read MoreRead Less
Next Story