Editorial: ఆదిలాబాద్ జిల్లాలో ఇంటిపోరు రాజకీయం...

Editorial: ఆదిలాబాద్ జిల్లాలో ఇంటిపోరు రాజకీయం...
కాంగ్రెస్ నేత ప్రేమ్ సాగర్ కు ఇంటిపోరు; కంట్లో నలుసుగా మారిన చిన్నాన్న కొడుకు; నువ్వానేనా అన్న చందాన్న మారిన రాజకీయం

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీని దశాబ్దానికి పైగా ఏకచత్రాధిపత్యంగా నడిపిన తూర్పు జిల్లా కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్ రావుకు ఇంటిపోరు ఎక్కువైంది. తన రాజకీయ ఆరంగేట్రం మొదలుపెట్టిన ఆసిఫాబాద్ నియోజకవర్గంలో గతంలో ఆయన ఏది చెబితే అదే శాసనంగా నడిచిందని స్థానికుల చెబుతుంటారు. అలాంటి నియోజకవర్గంలో ప్రేమ్ సాగర్ రావు ఇప్పుడు తన సొంత చిన్నాన్న కొడుకు, సోదరుడైన కొక్కిరాల విశ్వ ప్రసాద్ రావుతో వర్గ పోరును ఎదుర్కొంటున్నారన్న అభిప్రాయాలు కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. తూర్పు జిల్లాపై పూర్తి పట్టు ఉన్న ప్రేంసాగర్ రావు.. మొదటి నుంచి ఆసిఫాబాద్ నియోజక వర్గంలో తాను చెప్పిన వారికే ఎమ్మెల్యే టికెట్ వస్తోంది. 2009, 2014, 2018లో తన శిష్యుడు ఆత్రం సక్కుకు టికెట్ రాగా.. 2009, 2014లో రెండు సార్లు విజయం సాధించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పీఎస్ఆర్ తన పట్టు నిలుపుకునేందుకు 2019లో తన సోదరుడు కొక్కిరాల విశ్వప్రసాద్ కు డీసీసీ అధ్యక్ష పీఠం కట్టబెట్టారు. విశ్వప్రసాద్ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీలో డీసీసీ అధ్యక్షుడిగా క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక.. విశ్వప్రసాద్ రేవంత్ రెడ్డికి మద్దతు తెలిపారు. మొదటి నుంచి రేవంత్ అంటే గిట్టని కొక్కిరాల.. విశ్వప్రసాద్ ను మందలించటంతో ఆయన సహకారంతో వచ్చిన డీసీసీ పదవికి రాజీనామా చేశారు. రేవంత్ రెడ్డి ఆయన్ను పిలిచి మళ్లీ.. ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించటంతో.. అన్న దమ్ముల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినట్లు చర్చజరుగుతోంది.

ఎస్టీ రిజర్వు స్థానమైన ఆసిఫాబాద్ లో సోదరులు ఇద్దరు ఆధిపత్యం కోసం వ్యూహరచన చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. తమ వారికి టికెట్ ఇప్పించి.. పట్టు నిలుపుకోవాలని ఇరువురు నేతలూ భావిస్తున్నారట. స్థానికురాలైన మర్సుకోల సరస్వతిని అభ్యర్థిగా డీసీసీ అధ్యక్షుడు విశ్వ ప్రసాద్ ప్రతిపాదిస్తున్నారు. ఆమె తండ్రి రాజకీయ నేపథ్యం, సరస్వతి రెండు పర్యాయాలు ఆసిఫాబాద్ పంచాయతీ సర్పంచిగా గెలవటం, ఆదివాసీ మహిళ కావటంతో ఎన్నికల్లో కలిసి వస్తుందని భావిస్తున్నారట. అదీకాక ఆమె జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మికి సోదరి కావటంతో.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ కోవలక్ష్మికి వస్తే ఆమెను ఓడించవచ్చనేది విశ్వప్రసాద్ వ్యూహంగా సన్నిహితులు చెబుతున్నారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావు ఆసిఫాబాద్ సెగ్మెంటులో తన పట్టు చేజారకుండా ప్రయత్నాలు ముమ్మరం చేశారట. గత 15ఏళ్లుగా తాను అనుకున్న వ్యక్తికే టికెట్ ఇప్పించుకుని గెలిపించుకుంటూ వస్తున్నారు. దీంతో గణేష్ రాథోడ్ అనే వ్యక్తిని రంగంలోకి దింపగా.. ఆయన అభ్యర్థిత్వంపై డీసీసీ అధ్యక్షుడు విశ్వ ప్రసాద్ వర్గం అభ్యంతరం వ్యక్తం చేస్తోందట. గణేశ్ రాథోడ్ స్థానికేతరుడుకాగా.. ఆ సెగ్మెంటులో ఆదివాసి, లంబాడాల మధ్య అంతర్యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో లంబాడాకు చెందిన గణేష్ రాథోడ్ అభ్యర్థిగా ఉంటే.. ఆదివాసీల ఓట్లు పడవని చెబుతున్నారట.

తమ వ్యక్తే ఎమ్మెల్యే కావాలనే పోరాటంలో ఇద్దరు నేతలు నువ్వా.. నేనా అన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారట. దీంతో రెండు వర్గాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోందని ప్రచారం జరుగుతోంది. ఇటీవల సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రలో అన్నదమ్ముల మధ్య విభేదాలు బయటపడినట్లు సమాచారం. ఏకంగా రెండు వర్గాల చెందిన కార్యకర్తలు, నాయకులు రోడ్డెక్కి నినాదాలు, ప్రతి నినాదాలతో ఆధిప్యత పోరుకు దిగడంతో పార్టీలో విభేదాలు బజరున పడ్డాయి. ఒకానొక దశలో కొందరు కార్యకర్తలు ఏకంగా ప్రేంసాగర్ రావునే తోసేయగా.. ఆయన భావోద్వేగానికి గురై అప్పట్లో కన్నీరు పెట్టుకున్నారు. అన్నదమ్ముల పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో తెలియాలంటే ఎన్నికల వరకు ఎదురు చూడాల్సిందే.

Tags

Read MoreRead Less
Next Story