Telangana : రేపే కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం

Telangana : రేపే  కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం
64 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్, కాసేపట్లో సీఎల్పీ సమావేశం

రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం మెుదలైంది. పదేళ్లుగా కనీసం ప్రతిపక్షంలో కూడా లేని కాంగ్రెస్‌ పార్టీ ఏకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగింది. మెుదటి నుంచి అన్ని సర్వే అంచనాలను నిజం చేస్తూ రాష్ట్రంలో క్లియర్ కట్‌ మెజార్టీతో కాంగ్రెస్‌ దూసుకొచ్చింది. అధికార భారాస పట్ల ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఆసరాగా చేసుకుని అధికారమే లక్ష్యంగా అడ్డంకుల్ని అధిగమించి అధికారానికి దగ్గరైంది. వ్యూహాత్మక ఎత్తుగడలు, నేతల ఐక్యతతో తెలంగాణను హస్తగతం చేసుకుంది. ఒక కొత్త చరిత్రకు నాంది పలికింది. తెలంగాణలో కొత్త సీఎం రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండనుంది. ఇప్పటికే పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను అందర్నీ తాజ్ క్రిష్ణా హోటల్ కు తరలిస్తున్నారు. ఈ రాత్రికి సీఎల్పీ సమావేశం ఉండే అవకాశం ఉంది. దీంట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల అభిప్రాయాలను ఏఐసీసీ సేకరించనుంది. రేపటిలోగా సీఎం పేరును ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రేపు గవర్నర్‌ను కాంగ్రెస్ పార్టీ కలవనుంది.

రాష్ట్రంలో కాంగ్రెస్ విజయాన్ని అమరవీరులకు అంకితం చేస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. శ్రీకాంతాచారి అమరుడైన డిసెంబర్ 3నాడే తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, ఇతర హామీలను కచ్చితంగా నెరవేరుస్తామన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయో కాంగ్రెస్ కు KTR అభినందనలు తెలపడాన్ని రేవంత్ రెడ్డి స్వాగతించారు. అధికార పక్షానికి విపక్షాలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి అన్ని పార్టీలను ఆహ్వానిస్తామని చెప్పారు. ఈ విషయాలపై డీజీపీ అంజనీకుమార్తో చర్చించారు. భద్రతా ఏర్పాట్లు చేయాలని డీజీపీకి రేవంత్ రెడ్డి సూచించారు. అయితే ఇదే సమయంలో

ఎలక్షన్ కమిషన్ (ఈసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. డీజీపీ అంజనీకుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుండగానే టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డిని డీజీపీ కలుసుకుని చర్చ జరపడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని పీటీఐ న్యూజ్ ఏజెన్సీ తెలిపింది. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న సమయంలో రేవంత్ రెడ్డిని కలిసి ప్రమాణ స్వీకారంపై చర్చించడంతో డీజీపీపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story