TS: తెలంగాణలో ప్రచార జోరు

TS: తెలంగాణలో ప్రచార జోరు
నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్న నేతలు.... ప్రజాక్షేత్రంలో వడివడిగా కదులుతున్న నాయకులు

సార్వత్రిక ఎన్నికల కోసం ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రజాక్షేత్రంలో వడివడిగా కదులుతున్నారు. తెలంగాణలో రాజకీయ పక్షాలకు చెందిన నాయకులు నియోజకవర్గాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పాగా వేయాలనే లక్ష్యంతో ప్రచారజోరు పెంచారు. లోక్‌సభ ఎన్నికల్లో మెరుగైన స్థానాల్లో సత్తా చాటేలా పార్టీలు ప్రచార వేగాన్ని పెంచాయి. సికింద్రాబాద్‌లో గులాబీ జెండా రెపరెపలాడేలా.. కారు పార్టీ వ్యూహాలు రచిస్తోంది. సికింద్రాబాద్ బీఆర్‌ఎస్‌ MP అభ్యర్థి పద్మారావు గౌడ్‌కు మద్దతుగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సనత్ నగర్ నియోజకవర్గ సన్నహాక సమావేశాలు నిర్వహించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌ పరిధిలో వచ్చిన ఫలితాలను ఎంపీ ఎన్నికల్లోనూ పునరావృతం చేయాలని తలసాని, పద్మారావుగౌడ్‌ ఆకాంక్షించారు. భాగ్య నగరానికి మహర్దశ తెచ్చిన ఘనత ముమ్మాటికీ కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని ఉద్ఘాటించారు.


మల్కాజ్‌గిరి బీఆర్‌ఎస్‌ లోక్‌సభ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బండారి లేఔట్ నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. శ్రీరాముని కుంట వద్ద వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో ముచ్చటించి మద్దతు పలకాలని కోరారు. బండారి లేఔట్‌ కాలనీ వాసుల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని కమలం పార్టీ ముమ్మరం చేసింది. దేశంలో మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని నిజామాబాద్‌ MP అర్వింద్‌ ధీమా వ్యక్తం చేశారు. సార్వత్రిక ప్రచారంలో భాగంగా నిజామాబాద్‌లోని పలు డివిజన్లలో కలియ తిరిగారు. టిఫిన్ బైఠక్ కార్యక్రమంలో పాల్గొని మహిళలతో కలసి అల్పాహారం తిన్నారు. బీజేపీ అవశ్యకతను వివరించారు. వికసిత భారత్‌ కోసం జనం మద్దతు పలకాలని కోరారు. అనంతరం బీజేపీ ఆవిర్భావ దినోత్సవంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తాతో కలిసి పాల్గొన్నారు. ప్రతీ పార్టీ కార్యకర్తకు అండగా ఉంటామని నాయకులు భరోసా ఇచ్చారు.

నాగర్ కర్నూల్ లోక్‌సభ అభ్యర్థి భరత్ ప్రసాద్‌కు MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మద్దతు పలికారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌... రాష్ట్రంలో అధికంగా ఉన్న మాదిగలను మోసం చేశాయని ఆరోపించారు. రేవంత్‌ హయంలో మాదిగలకు ఒక్క లోక్‌సభ స్థానం కేటాయించకపోవడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గాంధీ చౌరస్తాలో బీజేపీ కార్యకర్తలు పార్టీ జెండాను ఆవిష్కరించారు. రాన్నున్న లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 400 సీట్లు రావటం ఖాయమన్నారు .

Tags

Read MoreRead Less
Next Story