EC: పారదర్శకంగా తెలంగాణ ఎన్నికలు

EC: పారదర్శకంగా తెలంగాణ ఎన్నికలు
ప్రలోభాలకు తావులేకుండా నిర్వహిస్తామన్న ఎన్నికల సంఘం.. ప్రజాస్వామ్య పండగకు తరలిరావాలని పిలుపు...

తెలంగాణలో ప్రలోభాలకు తావులేకుండా స్వేచ్ఛగా, పారదర్శకంగా శాసనసభ ఎన్నికలు జరిగేలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు అధికార యంత్రాంగం కచ్చితంగా వ్యవహరించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. అధికారులు సమర్థంగా పనిచేయని పక్షంలో తాము చేయిస్తామని వ్యాఖ్యానించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై మూడ్రోజులపాటు వరుసగా సమావేశాలు జరిపిన కేంద్ర ఎన్నికల అధికారుల బృందం, అన్ని రాష్ట్రాల్లో పరిస్థితులను సమీక్షించి షెడ్యూల్‌పై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపింది. ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ప్రజాస్వామ్య పండుగను విజయవంతం చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చింది.


శాసనసభ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం మూడ్రోజుల హైదరాబాద్‌ పర్యటన ముగిసింది. రాజకీయ పార్టీలు, అధికారులతో విస్తృత సమీక్ష నిర్వహించిన కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని EC బృందం ఎన్నికల ఏర్పాట్లు, ప్రణాళికలను ఆరా తీసింది. ప్రలోభాలకు తావు లేకుండా ఎన్నికలు నిర్వహించాలని, కేంద్ర బలగాలు మోహరించాలని, ఎన్నికల వ్యయం పెంచాలని, వెబ్ కాస్టింగ్ చేయాలని, సామాజిక మాధ్యమాలపై నిఘా ఉంచాలని రాజకీయ పార్టీలు కోరినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఓటర్ల జాబితాకు సంబంధించి పూర్తి పారదర్శకంగా వ్యవహరించామని తొలగింపులు పూర్తి పద్ధతి ప్రకారమే చేసినట్లు వివరించింది.


మొత్తం 3 కోట్లా 17 లక్షలకు పైగా ఓటర్లకు 35వేల 356 పోలింగ్ కేంద్రాలున్నాయని.. సగటున ఒక్కో కేంద్రంలో 897 మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించింది. తొలిసారిగా 80 ఏళ్లు పైబడిన 4లక్షల 43 వేల మందితో పాటు 5 లక్షలకు పైగా దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం 12-D ఫారం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దివ్యాంగులు పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చే ఆసక్తి ఉంటే ఉచితంగా రవాణా సౌకర్యం ఉంటుందని చెప్పారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం, కానుకల పేరిట ప్రలోభాల పర్వంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించనున్నట్లు ఈసీ తెలిపింది. సరిహద్దుల్లో వివిధశాఖల ఆధ్వర్యంలో మొత్తం 148 చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని.. వాటిని సీసీటీవీలతో అనుసంధానించనున్నట్లు పేర్కొంది.

డబ్బు, ప్రలోభాల విషయంలో ఈసారి ఖచ్చిత చర్యలు తీసుకుంటామని.. స్వాధీనం చేసుకున్న మొత్తానికి సంబంధించి ప్రతి వారం నివేదికలు పరిశీలిస్తామని తెలిపింది. ప్రలోభాలకు సంబంధించి కింగ్ పిన్స్‌ను గుర్తించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొంది. ఆన్‌లైన్‌లో నగదు బదిలీలపై నిఘా ఉంటుందని.. హెలిప్యాడ్స్, విమానాశ్రయాల్లోనూ ప్రత్యేకంగా దృష్టిసారిస్తామని చెప్పారు. తప్పుడు అఫిడవిట్ ల విషయంలో చట్ట ప్రకారం ముందుకెళ్తామని, అభ్యర్థుల పూర్తి అఫిడవిట్లను వెబ్ సైట్ లో పొందుపరుస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ తెలిపారు. ఎన్నికలు జరగనున్న అన్ని రాష్ట్రాల్లో పరిస్థితులు సమీక్షించుకొని ఎన్నికల షెడ్యూల్ పై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story